* కేంద్ర మంత్రి రవ్‌నీత్ బిట్టు, రాహుల్ గాంధీ వాగ్వాదం
పార్లమెంట్ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య బుధవారం ఉదయం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సెషన్ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి వెళ్తుండగా ‘మిత్రద్రోహి వెళ్తున్నాడు.. ఆయనను చూడండి’ అంటూ అతడితో రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి ప్రయత్నించారు.
దీనికి నిరాకరించడంతో ‘హలో సోదరా.. బాధపడకు.. నువ్వు ఎప్పటికైన తిరిగి వస్తావు (కాంగ్రెస్‌లోకి)’ అంటూ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలపై బిట్టూ స్పందిస్తూ.. ‘నువ్వు దేశ ద్రోహివి’ అంటూ రాహుల్‌పై మండిపడ్డారు. దీంతో ఇరువురి మధ్య చిన్న వాగ్వాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలను రాహుల్ సమర్థించుకున్నారు.
రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి ముందుకొచ్చినప్పుడు తాను ఎందుకు నిరాకరించానో బిట్టు వివరిస్తూ 1984లో నిర్వహించిన బ్లూస్టార్ ఆపరేషన్ గాంధీ కుటుంబం వల్లే జరిగిందని విమర్శించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లు కూడా ఆ కుటుంబం వల్ల జరిగినట్లు పేర్కొన్నారు.
“వాళ్లు దేశద్రోహులు, దేశానికి శత్రువులు, ప్రతిరోజూ సైన్యం గురించి, దేశం గురించి చెడుగా మాట్లాడుతారు. సిక్కుల హంతకులైన గాంధీ కుటుంబ వారసుడితో ఒక సర్దార్ ఎప్పటికీ కరచాలనం చేయడు” అని బిట్టు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ రవ్‌నీత్ సింగ్ బిట్టుపై చేసిన మిత్రద్రోహి వ్యాఖ్యపై బీజేపీకి చెందిన ప్రముఖ సిక్కు నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ఆమోదయోగ్యం కాదని, ఇది సిక్కు సమాజానికి ఒక పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యపై మండిపడ్డారు. బిట్టు తాతగారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్య దురదృష్టకరమని లవ్లీ పేర్కొన్నారు.
కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఢిల్లీ మంత్రి మంజీదర్ సింగ్ సిర్సా ఖండించారు. ‘రాహుల్ గాంధీ, అతడి కుటుంబం ద్రోహులు.. సిక్కులు, సర్దార్‌లు కాదు.. ఆయన వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ మనస్తత్వం ఏమాత్రం మారలేదని అర్ధమవుతోంది’ అని విమర్శించారు.
అటు, రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ‘ద్రోహి’కి అంతకంటే సరైన పదం మరొకటి లేదని వాదించింది. “ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వకపోతే మేము ఏం చేయగలం? బిట్టును ఎంపీగా ఎవరు చేశారు? ఒక ద్రోహి గురించి మనం ఇంకేం చెప్పగలం?’ అని కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ రాజా వారింగ్ అన్నారు.
రవ్‌నీత్ సింగ్ బిట్టు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకుముందు మూడుసార్లు 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తమ సభ్యులను సస్పెండ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది.

More Stories
జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
అవినీతి మంత్రి రాజీనామాకై కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా ధర్నా
భారత్-చైనా మధ్య 155 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం