గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలకు కాబినెట్ నిర్ణయం చాలు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలకు కాబినెట్ నిర్ణయం చాలు

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాల అంశం గత కొంతకాలంగా రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది.  గత సంవత్సరం ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పామని జస్టిస్‌ విక్రంనాథ్‌ ధర్మాసనం తెలిపింది.

కేబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తమ ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అమిర్‌ అలీ సుప్రీంకోర్టులో వెకేట్‌ పిటిషన్‌ వేశారు.  అమిర్‌ అలీ పిటిషన్‌ను దాసోజు శ్రవణ్‌ వేసిన ప్రధాన పిటిషన్‌తో జత చేస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ధర్మాసనం మార్చి 19కి వాయిదా వేసింది.

2024 ఆగస్టు 16న కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని నెలల తర్వాత వీరిని పదవుల నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో కోదండరాం, అజారుద్దీన్‌ నియామకాలకు ఉన్న ప్రధాన అడ్డంకి దాదాపుగా తొలగినట్టే రాజకీయ నేతలు భావిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల కారణంగా నియామకాలు నిలిచిపోయాయన్న వాదనకు ఇక చెల్లుబాటు ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

సుప్రీంకోర్టు స్పష్టత తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికార పార్టీకే కాకుండా ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక స్పష్టమైన సంకేతంగా మారింది. గవర్నర్‌ పాత్రపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు కొంత మేరకు ముగింపు పలికినట్టేనని భావిస్తున్నారు.