లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ కార్యకలాపాలు మంగళవారం పూర్తిగా స్థంభించాయి. స్పీకర్ చైర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు సభ్యులు కాగితాలు చించి విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ఘటనపై కఠినంగా స్పందించిన స్పీకర్ మొత్తం బడ్జెట్ సమావేశాల కాలానికి ఎనిమిది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం పలు సార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ మళ్లీ సమావేశమైంది. ఆ సమయంలో చైర్‌లో ఉన్న ఎంపీ దిలీప్ సైకియా సభను ప్రారంభించగానే విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లిన కొందరు సభ్యులు పత్రాలు చించి స్పీకర్ వైపు విసరడం కలకలం రేపింది.
సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎనిమిది మంది సభ్యులను గుర్తించారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు కాగా, ఒకరు వెంకటేసన్ సిపిఎం సభ్యుడు. సస్పెండ్ అయిన వారిలో ఎంపీలు హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్, కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిపై మిగిలిన బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెన్షన్ విధించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు.
ఆ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. చైర్‌పై పేపర్లు విసిరేయడాన్ని స్పీకర్ ఖండించారు. పార్లమెంటరీ హుందాతనాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పారు. బడ్జెట్ సెషన్‌లో ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేమని స్పష్టం చేశారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్‌లో సమస్యలను లేవనెత్తే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, సభ అందరిదని, చర్చలు జరగాలని, కానీ సభా వ్యవహారాలను అడ్డుకోవడం సరికాదు అని, నిరసన పేరుతో సభా నిర్వహణను స్తంభింపచేయడం కుదరదని దిలీప్ సైకియా హితవు చెప్పారు. ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తప్పుపట్టారు. ప్రతి సభ్యుడిని మాట్లాడే హక్కు ఉందని, వారి ఆందోళనలను వినిపించుకోవాలని ఆమె చెప్పారు. ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని విమర్శించారు.

More Stories
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం
ఆర్ఎస్ఎస్ పై ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’ చిత్రం 19న విడుదల
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తక ప్రస్తావనతో లోక్ సభలో గందరగోళం