క్రికెట్ అంటేనే అంతర్జాతీయంగా భారత్ – పాకిస్థాన్ మధ్య ఉండే ఆటలకున్న క్రెజ్ మరెవ్వరి ఆటలకు ఉండదు. అటువంటిది కొద్దీ రోజులలో ప్రారంభమయ్యే టి20 ప్రపంచ కప్ 20026 పోటీలలో ఈ నెల 15న కొలొంబోలో భారత్ తో ఆడాల్సిన ఆటలో పాల్గొనమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించడం కేవలం క్రీడాలకు సంబంధించి కాకుండా వ్యూహాత్మకంగా పాకిస్థాన్ వేసిన రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తుంది.
ఇది కేవలం రాజకీయ అంశం కాదని, వెనుక భారీ ఆర్థిక ఒప్పందాలు, బాధ్యతలు ఉన్నాయని ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పాకిస్థాన్ క్రికెట్ బోర్డును హెచ్చరించడం గమనార్హం. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రపంచకప్‌లో పాల్గొనే అనుమతి ఇచ్చినా, భారత్‌తో మ్యాచ్ ఆడే విషయంలో అడ్డుపడటం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
భద్రతా కారణాల సాకుతో భారత్ లో ఆడేందుకు తిరస్కరించిన బంగ్లాదేశ్ ను పోటీల నుండే సాగనంపే విధంగా చేసినందుకు ప్రతిగా పాకిస్థాన్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే బీసీసీఐ మాత్రం పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగానే తీసుకుంది. తాము ఐసీసీ ప్రొటోకాల్ పాటిస్తామని, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో స్టేడియానికి వెళ్తుందని సోమవారం బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
భారత్- పాక్ ల మధ్య జరిగేది ఓ సాధారణ షెడ్యూల్ మ్యాచ్ కాదు. టోర్నమెంట్ ఆదాయాన్ని నడిపించే ప్రధాన ఆర్థిక శక్తి అని చెప్పవచ్చు.ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్ ఒప్పందాలు, ప్రకటనల ఆదాయం, అలాగే చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధుల పంపిణీ వరకు—ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఐసీసీ భారీగా ఆధారపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రపంచకప్‌లో పాల్గొనే అనుమతి ఇచ్చినా, భారత్‌తో మ్యాచ్ ఆడే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం ఐసీసీకి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
భారత్–పాకిస్థాన్ మధ్య జరిగే ఒక్క టీ20 మ్యాచ్ విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. టీవీ, డిజిటల్ ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్ డీల్స్, టికెటింగ్, హాస్పిటాలిటీ, ప్రకటనలు వంటి అన్ని వాణిజ్య కార్యకలాపాలను కలిపితే ఈ ఆదాయం ఏర్పడుతుంది. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్‌కు ఇంతటి ఆర్థిక ప్రాధాన్యం లేదన్నది వాస్తవం.
మ్యాచ్ సమయంలో 10 సెకన్ల యాడ్ స్లాట్‌కు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలకడం సాధారణమే. ఈ మ్యాచ్ ఏ కారణంతోనైనా రద్దైతే, మొత్తం టోర్నమెంట్ ఆర్థిక లెక్కలు తలకిందులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యాచ్ రద్దయితే మొదటిగా నష్టపోయేది ప్రసార హక్కులు దక్కించుకున్న సంస్థలే. ఒక్క మ్యాచ్‌తోనే సుమారు రూ.300 కోట్ల ప్రకటనల ఆదాయం కోల్పోతారు.
ఇప్పటికే ఆర్థిక ఒత్తిడితో బ్రాడ్కాస్టర్లు ఐసీసీ వద్ద రాయితీలు కోరుతున్న నేపథ్యంలో, భారత్–పాకిస్థాన్ మ్యాచ్ రద్దు వారి వాదనకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రపంచకప్‌లో ఒక్కో మ్యాచ్ సగటు విలువ సుమారు రూ.138 కోట్లుగా ఉంటుందని అంచనా. బ్రాడ్కాస్టర్ల ఒత్తిడి పెరిగితే, ఆ భారాన్ని ఐసీసీ భరించాల్సి వస్తుంది. దాంతో సభ్య దేశాలకు పంపే ఆదాయంలో కోత పడే అవకాశం ఉంది. ఇది భారత్, పాకిస్థాన్‌తో పాటు ఐసీసీ నిధులపై ఆధారపడే చిన్న దేశాల క్రికెట్ బోర్డులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంచనాల ప్రకారం, మ్యాచ్ రద్దయితే భారత్, పాకిస్థాన్ బోర్డులకు చెరో రూ.200 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చు.
పాకిస్థాన్‌కు పెద్ద ప్రమాదం
ఐసీసీ మొత్తం ఆదాయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సుమారు 5.75 శాతం వాటా ఉంటుంది. ఇది ఏడాదికి దాదాపు 34.5 మిలియన్ డాలర్ల ఆదాయం. ఈ నిధులు కొనసాగాలంటే ఐసీసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా మ్యాచ్‌కు దూరంగా ఉంటే అది ‘ఫోర్స్ మేజర్’ కిందకు రాదు. దాంతో బీమా రక్షణ ఉండదు. చట్టపరమైన మినహాయింపులు కూడా వర్తించవు.
టోర్నమెంట్ చెల్లింపులు నిలిపివేయడం, జరిమానాలు, న్యాయపోరాటాలు వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశముంది. ఆర్థిక నష్టాలకన్నా ప్రతిష్ఠకు కలిగే భంగమే అత్యంత ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ మ్యాచ్‌లు ‘రిస్క్ అసెట్స్’గా మారితే, భవిష్యత్తులో ప్రసార హక్కుల విలువ పడిపోవడం, స్పాన్సర్ల ఆసక్తి తగ్గిపోవడం ఖాయం.
ఈ ఒక్క మ్యాచ్‌ను వదులుకోవడం వల్ల కలిగే నష్టం రాబోయే ఎన్నేళ్ల పాటు పీసీబీని వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరు కాదు. ప్రపంచ టోర్నమెంట్లు ఆచరణీయంగా కొనసాగేందుకు అవసరమైన ఆర్థిక శక్తి ఇది. ఈ మ్యాచ్ లేకపోతే ఒక్క ప్రపంచకప్ మాత్రమే కాదు మొత్తం ప్రపంచ క్రికెట్ వ్యవస్థే కుదేలయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
రాజకీయంగా ఐసీసీని ఇరకాటంలో పడవేసేందుకు కూడా ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. భద్రత ఆకారణాలు చూపి పాకిస్థాన్ లో ఆడేందుకు భారత్ ఎప్పుడు వెనుకాడినా ఐసీసీ సానుకూలంగా స్పందిస్తూ వచ్చింది. ఏనాడూ ఆటాల్సిందే అని భారత్ పై వత్తిడి తీసుకు రాలేదు. కానీ ఇప్పుడు బాంగ్లాదేశ్ విషయంలో అటువంటి వత్తిడి తీసుకొచ్చి, ఆట నుండే ఆదేశం వైదొలిగే విధంగా చేయడం ద్వారా ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనే వాదనలను పాకిస్తాన్ లేవనెత్తుతున్నది.

More Stories
వాణిజ్య ఒప్పందంకు ట్రంప్ ఆమోదం… సుంకాలు 7 శాతం తగ్గింపు!
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తక ప్రస్తావనతో లోక్ సభలో గందరగోళం
దివ్యాంగులకు సులభతరంగా సర్టిఫికేట్ లు ఇవ్వాలి