మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేష్ ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఎన్టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని ఆయన ఇంటిపై ఆదివారం సాయంత్రం రాళ్లు రువ్వాయి. కర్రలతో దాడి చేశాయి. ఇంటిపై పెట్రోల్ బాటిళ్లు విసిరి నిప్పంటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లపై జోగి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి టిడిపి శ్రేణులు ఇబ్రహీంపట్నం చేరుకున్నాయి.
రింగ్ సెంటరులో నిరసన తెలిపి అక్కడి నుంచి నేరుగా ఒక్క ఉదుటన జోగి నివాసం వైపు టిడిపి కార్యకర్తలు పరుగులు పెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారిని నెట్టి వేసి జోగి ఇంటిపైకి దూసుకెళ్లారు. కర్రలు, రాళ్లు, పెట్రోల్ బాటిళ్లతో ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫస్ట్‌ఫ్లోర్ కారిడార్లోకి పెట్రోల్ బాటిల్ విసిరారు. దీంతో, ఇంట్లో మంటలు వ్యాపించి కారిడార్, ఫర్నీచర్ దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ కమ్మింది.
ఇంటి ముందున్న జోగి-శకుంతల ప్యాలెస్ బోర్డును పగులగొట్టారు. ఫ్లెక్సీలకు, బ్యానర్లకు నిప్పు పెట్టారు. రాళ్ల దాడితో కారిడార్ అద్దాలు ధ్వంసమయ్యాయి. బాదులతో గుద్దడంతో గేటు పాక్షికంగా దెబ్బతింది. అక్కడ పోలీసులు ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు టిడిపి శ్రేణులను వెనక్కి పంపారు. జోగి ఇంటి ముందు జోగి, అంబటి దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు టిడిపి శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం టిడిపి శ్రేణులు మళ్లీ రింగ్ సెంటర్‌కు చేరుకుని జోగి రమేష్, అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి మోహనరావు, రమేష్ సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్ ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు.
దాడి సమాచారం తెలుసుకుని వైసిపి శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇరు పార్టీల వారు పోటాపోటీగా వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసిపి నేతలు, కార్యకర్తలు జోగి ఇంటిని పరిశీలించారు. సంఘటన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

More Stories
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్వదేశీ కిట్ లను బహూకరించిన మాధవ్
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే రూ.25 వేలు
మార్చి 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై ‘మహా కుంభాభిషేకం’