* ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోదీ ప్రస్తావనపై భారత్ ఆగ్రగాం
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉండడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అవి ఒక లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ చేసిన చెత్త ప్రేలాపణలు అని కొట్టిపారేసింది. ఎప్స్టీన్ ఫైల్స్‌లోని ఒక ఇమెయిల్‌లో ప్రధాని మోదీ పేరు ఉంది. జాబర్ వై అనే వ్యక్తికి జెఫ్రీ ఎప్స్టీన్ పంపిన ఇమెయిల్‌లో జూలై 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి ప్రస్తావించారు.
ప్రధాని మోదీ సలహా తీసుకున్నారని పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో నృత్యం చేసి పాడారని కూడా ఎప్స్టీన్ పేర్కొన్నారు. ఆ ఇమెయిల్‌లో, “భారత ప్రధాన మంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడి ప్రయోజనం కోసం ఇజ్రాయెల్‌లో నృత్యం చేసి పాడారు. వారు కొన్ని వారాల క్రితం కలుసుకున్నారు. . అది పనిచేసింది. !”
అయితే, ప్రధానమంత్రి మోదీ సలహా తీసుకున్నారనే ఈ ఆరోపణలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఒక ప్రకటనలో, ప్రధానమంత్రి మోదీ జూలై 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించిన మాట నిజమే అయినప్పటికీ, మిగిలిన విషయాలన్నీ తప్పు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఓ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “సోకాల్డ్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి ఉన్న ఒక ఈ-మెయిల్‌పై వస్తున్న రిపోర్టులను మేము చూశాము” అని చెప్పారు.
“2017 జులైలో ప్రధానమంత్రి జరిపిన అధికారిక ఇజ్రాయెల్ పర్యటన అనే వాస్తవం తప్ప, ఆ ఈ-మెయిల్‌లో ఉన్న మిగిలిన అంశాలన్నీ శిక్ష పడిన ఒక నేరస్థుడి చెత్త ప్రేలాపనలు మాత్రమే. వాటిని మేము తోసిపుచ్చుతున్నాం” అని ఆయన కొట్టిపారవేసారు. 2017 జులైలో ప్రధాని మోదీ జరిపిన ఇజ్రాయెల్ పర్యటన చారిత్రాత్మకమైనది. 1992లో భారత్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత, ఆ దేశంలో అడుగుపెట్టిన మొదటి భారత ప్రధానమంత్రి మోదీ కావడం గమనార్హం.
ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఉద్దేశించిన ఒక చట్టం ప్రకారం, అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ తాజాగా ఆ రికార్డులను విడుదల చేసింది. దీనిపై డిప్యూటీ యూఎస్ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మాట్లాడుతూ, తాజాగా విడుదల చేసిన వాటిలో దాదాపు 30 లక్షల పేజీల పత్రాలు, 2,000 కంటే ఎక్కువ వీడియోలు, 1,80,000 చిత్రాలు ఉన్నాయని తెలిపారు.
డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఈ ఫైళ్లలో, గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయకుండా నిలిపివేసిన సమాచారం కూడా చేర్చడం గమనార్హం. ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో రూపొందించిన “ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్” ప్రకారం ఈ వివరాల వెల్లడి తప్పనిసరి అయ్యింది. ఈ చట్టం ఎప్‌స్టీన్ మాత్రమే కాకుండా, అతని సహచరురాలు ఘిస్లేన్ మాక్స్‌వెల్‌కు సంబంధించిన ఫైళ్లను కూడా బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది.
జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019 జులైలో ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యి, 2019 ఆగస్టులో న్యూయార్క్ జైలు గదిలో మరణించాడు. అతని మరణాన్ని ఆత్మహత్యగా అధికారులు నిర్ధరించారు. ముఖ్యంగా, ఈమెయిల్ టెక్స్ట్ నిగూఢంగా, అస్పష్టంగా ఉంది. ఈమెయిల్‌లో ఎవరు ఏ సలహాను, ఎవరి ద్వారా ప్రస్తావించారో స్పష్టంగా లేదు.
డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో ‘డ్యాన్స్ చేసి పాడారని’ కూడా సూచించినట్లు తెలుస్తోంది. అందుకు అవకాశం లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ పర్యటన సమయంలో ట్రంప్ ఇజ్రాయెల్‌లో లేరు. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2017లో అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌ను కలిశారు. ఆపై జూలై 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. అందువల్ల, ఆ సమయంలో ఆయన ఇజ్రాయెల్‌లో ట్రంప్‌ను కలవడం సాధ్యం కాదు.

More Stories
గుంటూరులో ఉద్రిక్తత మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
న్యూజిలాండ్‌పై భారత్ సిరీస్ కైవసం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్