ఏపీ ఖజానాకు భారంగా పరిణమిస్తున్న అప్పులు

ఏపీ ఖజానాకు భారంగా పరిణమిస్తున్న అప్పులు
 
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు ఖజానాకు భారంగా పరిణమిస్తున్నాయి. లక్ష్యాన్ని మించి తీసుకుంటున్న రుణాల కారణంగా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నట్లు ఆర్థికశాఖ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న రుణ పరిమితిని కేవలం తొమ్మిది నెలల్లోనే అధిగమించడంతో భవిష్యత్తు అవసరాలపై ఆందోళన పెరిగిపోతోంది.
 
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.79,927 కోట్లు రుణంగా సమీకరించుకోవాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనికి కేంద్రం నుంచి కూడా అనుమతి లభించింది. అయితే రెవెన్యూ వ్యయం పెరిగిపోవడం, ఆదాయం తగ్గిపోవడంతో రుణాలు ఇబ్బడిముబ్బడిగా తీసుకోవాల్సి వస్తుంది. తొలి మూడు నెలలకే ఏకంగా 106 శాతంతో రూ.85,272 కోట్లు అప్పులు తీసుకున్నారు. 
 
ఇది ఆర్థిక ఇబ్బందులు మరింత పెంచేవిగానే ఆర్థికశాఖ అంగీకరిస్తోంది. గతేడాది కూడా ఇదే పరిస్థితి తలెత్తగా, ఆ తప్పిదాలను సవరించుకోవాలని ఈ ఏడాది ఆర్థికశాఖ భావించింది. అయితే పరిస్థితులు తలకిందులవడంతో తిరిగి అప్పులు చేయకతప్పని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటోంది. గతేడాది కూడా లక్ష్యానికి మించి 108 శాతం రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఈ సారి కూడా అదే పరిస్థితి నెలకొందని చెబుతోంది.
 
తొలి మూడు త్రైమాసికాలకే పరిమితి దాటి రుణాలు తీసుకోవడంతో మిగిలిన మూడు నెలల పరిస్థితిపై ఆందోళన నెలకొంటోంది. ఇక అధికారికంగా రుణాలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో చివరి మార్గంగా కేంద్రం వద్దకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.
పెరుగుతున్న జిఎన్జివి ఆధారంగా అదనపు రుణ సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు లేఖ కూడా రాయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కూడా బిజెపితో కూడిన కూటమి అధికారంలో ఉండడంతో కేంద్రంపై అదనపు రుణం కోసం ఒత్తిడి చేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు కూడా కేంద్రం వద్దకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.