బంగాల్‌లో మమతా ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

బంగాల్‌లో మమతా ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమత ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, దేశ రక్షణ కోసం బంగాల్‌లో బీజేపీ జెండా ఎగరడం అత్యవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం ‘చొరబాటుదారులకు ఆశ్రయం’ కల్పిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతనే పణంగా పెడుతోందని ఆయన మండిపడ్డారు.  ఉత్తర 24 పరగణాల జిల్లా బరాక్‌పుర్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

‘మా, మట్టి, మనుష్’ (అమ్మ, మట్టి, మనిషి) నినాదంతో అధికారంలోకి వచ్చిన మమత పాలనలో, నేడు ఆ మూడూ ప్రమాదంలో పడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. “మమత దీదీ ‘మా, మట్టి, మనుష్’ నినాదంతో అధికారంలోకి వచ్చారు. కానీ నేడు బంగాల్‌లో ఈ మూడూ సురక్షితంగా లేవు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. వారికి భద్రత కరువైంది. బంగాల్ నేలను చొరబాటుదారులు మింగేస్తున్నారు. ఇక్కడి సామాన్య ప్రజలు మమత సిండికేట్ ఆగడాలతో, దోపిడీలతో నలిగిపోతున్నారు” అని షా విమర్శించారు.

అమిత్ షా తన ప్రసంగంలో చొరబాట్ల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదని స్పష్టం చేశారు.”బంగాల్‌లో చొరబాటుదారులు యథేచ్ఛగా వస్తున్నారు. ఇది ఇప్పుడు కేవలం బంగాల్ సమస్య కాదు, మొత్తం దేశ భద్రతకే ముప్పుగా మారింది” అని హెచ్చరించారు.  “సరిహద్దుల్లో కంచె వేయడానికి భూమి ఇవ్వాలని కోర్టులు ఆదేశించాయి. అయినా సరే మమత ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళానికి భూమి ఇవ్వడం లేదు. ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఆ చొరబాటుదారులు టీఎంసీకి ఓటు బ్యాంకుగా మారారు” అని ఆయన ధ్వజమెత్తారు.

 “రాష్ట్రంలోని పోలీసులు, అధికారులు అక్రమ వలసదారులను అడ్డుకోవడం లేదు. నకిలీ పత్రాలు సృష్టించి వారిని దేశమంతటా పంపిస్తున్నారు. దీనివల్ల దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి” అని హోంమంత్రి ఆరోపించారు. మమతా బెనర్జీ తీరును రామాయణంలోని రావణుడితో పోల్చుతూ షా వ్యాఖ్యలు చేశారు.

“రాముడు సముద్రంపై వారధి కడుతున్నప్పుడు, ఈ భూమ్మీద నన్ను ఓడించేవారే లేరని రావణుడు అహంకరించి అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసు. మమత జీ, మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ ఈసారి బీజేపీ సునామీని ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో మాకు 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయి. భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది” అని జోస్యం చెప్పారు. 

“కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించింది. కానీ పార్లమెంటులో దీనిపై చర్చను టీఎంసీ ఎంపీలు అడ్డుకున్నారు. కేవలం చొరబాటుదారులను సంతోషపెట్టడానికే మమత ఇలా చేస్తున్నారు. వందేమాతరాన్ని వ్యతిరేకించడం అంటే మోదీని వ్యతిరేకించడం కాదు, బంగాల్‌ను, భారతదేశ గౌరవాన్ని అవమానించడమే” అని మండిపడ్డారు.

బంగాల్‌లో అవినీతి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇటీవలి అగ్నిప్రమాదాన్ని షా ఉదహరించారు. “ఇటీవల ఆనందాపుర్‌లోని మోమో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అది ప్రమాదం కాదు, మమత సర్కార్ అవినీతి ఫలితం. ఆ ఫ్యాక్టరీ యజమానులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు? వారు అధికార పార్టీకి సన్నిహితులు కాబట్టే వదిలేశారా? అసలు బంగాల్‌లో పరిపాలన ఉందా?” అని ప్రశ్నించారు. 

వచ్చే ఎన్నికల్లో అవినీతి మచ్చన్న మంత్రులకు టికెట్లు ఇవ్వొద్దని సవాల్ విసిరారు. టీఎంసీ బెదిరింపులకు మతువా నమశూద్ర వర్గాలు భయపడొద్దని షా ధైర్యం చెప్పారు. వారి ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరని భరోసా ఇచ్చారు. బంగాల్‌లో ‘దేశభక్తుల ప్రభుత్వాన్ని’ స్థాపించడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.