అమెరికాలో మరోసారి పాక్షిక షట్​డౌన్

అమెరికాలో మరోసారి పాక్షిక షట్​డౌన్

అమెరికాలో మరోసారి పాక్షిక షట్​డౌన్ మొదలైంది. 2026 సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువులోపు కాంగ్రెస్ ఆమోదించలేదు. దీంతో ప్రభుత్వం పాక్షికంగా షడ్​ డౌన్ అయింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా శనివారం వెల్లడించింది. 2026 బడ్జెట్‌ ఆమోదానికి విధించిన గడువు ముగియడంతో ఫెడరల్‌ ప్రభుత్వంలో మూడొంతుల విభాగాలు ప్రభావితమయ్యాయి.

ఒక వేళ వచ్చే సోమవారం బడ్జెట్‌ ఆమోదానికి సభ చర్యలు తీసుకుంటే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు పునరుద్ధరణ జరుగుతుంది. ప్రజాసేవలు, కాంట్రాక్టర్లు, ఫెడరల్‌ ఉద్యోగుల జీతాలకు సంబంధించి అంతరాయాలు పరిష్కారమవుతాయి.  ఒకవేళ అది జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోకి వెళ్లనున్నారు. లేదా చట్టసభ సభ్యులు చర్యలు తీసుకునే వరకు జీతాల్లేకుండానే పనిచేయాల్చి ఉంటుంది.
అయితే సెప్టెంబర్ వరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు ఇచ్చేందుకు ఐదు పెండింగ్ బిల్లులకు మార్గం సుగమం చేసే చట్టాన్ని శుక్రవారం సెనేట్‌ ఆమోదించింది.  విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, రక్షణ సంబంధిత ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌కు రెండు వారాల స్టాప్‌గ్యాప్‌ను ఆమోదించింది. సోమవారం ఎగువసభలో సమావేశం తిరిగి ప్రారంభం కానుండటంతో త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెమొక్రాట్లను కోరారు. 
 
అయితే ఈ షట్​డౌన్​ పాక్షికమేనని చట్టసభ సభ్యులు చెబుతున్నారు. వచ్చేవారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. తాజా ప్రభుత్వ షట్‌డౌన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంబిస్తున్న కఠిన వలస వ్యతిరేక విధానాలే కారణం. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు నిధుల కేటాయింపుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. 
 
మాస్ డిపోర్టేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా మోహరించిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు, వలసవాదులను ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మిన్నియా పోలిస్‌లో నిరసనలు చేస్తున్న అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే ఇద్దరు అమెరికన్‌ పౌరులు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు.

ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డెమొక్రాట్లు, డీహెచ్​ఎస్​కు నిధులు ఇచ్చే బిల్‌కు అంగీకరించడం లేదు. తాము మద్దతు ఇవ్వాలంటే డీహెచ్​ఎస్​లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారంట్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు, అరెస్టులు చేయకూడదు. ఫెడరల్ ఏజెంట్లకు రాష్ట్ర పోలీసుల మాదిరిగా యూస్-ఆఫ్-ఫోర్స్, యూనిఫార్మ్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ వంటి నిబంధనలను తప్పనిసరి చేయాలి. హింసాత్మక ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డెమొక్రాట్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ట్రంప్‌ హయాంలో కొన్ని నెలల క్రితం అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన షట్‌డౌన్‌ తలెత్తింది. లక్షలమంది ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గతేడాది అక్టోబర్ 1న మొదలైన అమెరికా ప్రభుత్వం 43 రోజులు పాటు కొనసాగింది. అమెరికాలో చాలా ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు జరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.