శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన బంగారం దోపిడీ కేసు రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు జయరామ్ పేరు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో భాగంగా శుక్రవారం సిట్ అధికారులు చెన్నైలోని నటుడు జయరామ్ నివాసానికి వెళ్లి ఆయన నుంచి ఓ సాక్షిగా వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, పూజలపై గతంలో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక పూజలో బంగారం పూత ఉన్న రాగి పలకలు ఉపయోగించారన్న వార్తలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ అంశాలపై స్పష్టత కోసమే అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్ని కృష్ణన్ పొట్టితో జయరామ్‌కు ఉన్న పరిచయం కూడా విచారణలో కీలకంగా మారింది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు, ఎక్కడ పూజలు నిర్వహించారు? ఆ కార్యక్రమాల్లో ఉపయోగించిన వస్తువులు ఏవి? వాటికి సంబంధించిన లావాదేవీలు ఏవైనా జరిగాయా? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన పూజా వస్తువులు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఉపయోగించారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అధికారుల ప్రకారం, 2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఇటీవల బయటకు రావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఆ కార్యక్రమాన్ని ఉన్ని కృష్ణన్ పొట్టి నిర్వహించారని, అందులో శబరిమల ఆలయం నుంచి తీసుకువచ్చిన కొన్ని బంగారం పూత ఉన్న వస్తువులను పూజల్లో ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వీడియోలే ప్రస్తుతం సిట్ విచారణకు కీలక ఆధారాలుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఒకటి, శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహం నుంచి బంగారం కొట్టేశారా? రెండవది, శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమైందా? అనే అంశాలపై విస్తృతంగా విచారణ కొనసాగుతోంది. ఈ రెండు ఘటనలతో సంబంధం ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, పూజా కార్యక్రమాల నిర్వాహకులపై సిట్ నిఘా పెంచింది.
ఇప్పటికే ఈ బంగారం దోపిడీ కేసులో 12 మందిని అరెస్టు చేసిన అధికారులు, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సంకేతాలు ఇస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. శబరిమల వంటి అత్యంత పవిత్రమైన ఆలయానికి సంబంధించిన ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

More Stories
భారత్- ఈయూ ఒప్పందంపై అప్పట్లో అడ్డంకిగా జైరాం రమేష్!
గరిష్ట స్థాయికి చేరి ఒకేసారి పడిపోయిన బంగారం, వెండి ధరలు
ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!