భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ప్రాణాంతక నిఫా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు చాలా తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. బంగాల్ రాష్ట్రంలోని ఉత్తర24 పరగణా జిల్లాలో ఇద్దరికి నిఫా ఇన్ఫెక్షన్లు నిర్ధారణ అయినప్పటికీ, వ్యాప్తి రిస్క్ తక్కువగా ఉన్నందున విదేశీ ప్రయాణాలు, వాణిజ్యంపై ఆంక్షలను విధించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
నిఫా కేసుల విషయంపై తాము భారత ప్రభుత్వ ఆరోగ్య వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి నిఫా వైరస్ సంక్రమిస్తోందనే ఆధారాలేవీ ఇప్పటిదాకా లభించలేదని తెలిపింది. అందుకే విదేశీ ప్రయాణాలు, వాణిజ్యంపై ఆంక్షలను విధించాలని తాము సిఫార్సు చేయడం లేదని పేర్కొంది.
బంగాల్లోని ఉత్తర24 పరగణా జిల్లాలో గతంలోనూ నిఫా వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ గుర్తుచేసింది. అక్కడ తాజాగా నిఫా బారినపడిన ఇద్దరు రోగుల్లో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ అని తెలిపింది. 25 ఏళ్ల వయసు కలిగిన ఆ ఇద్దరు రోగులు, బరాసత్ పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వారని పేర్కొంది. 2025 డిసెంబరు చివరి వారంలో వారిలో నిఫా ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడ్డాయని చెప్పింది.
అనంతరం వారిద్దరిలో వేగంగా నాడీ సంబంధిత సమస్యలు తలెత్తాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంతో జనవరి మొదటివారంలో వారిని ఐసొలేషన్‌కు తరలించారని వివరించింది. ఈ ఇద్దరు నిఫా బాధితులతో కాంటాక్ట్ అయిన 196 మందిని గుర్తించి, వారందరికీ వైద్యపరీక్షలను నిర్వహించి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది. రోగులను కాంటాక్ట్ అయిన ఏ ఒక్కరిలోనూ ఇన్ఫెక్షన్ లక్షణాలు లేవని, వారికి నిఫా టెస్టులను చేయగా ‘నెగెటివ్’ వచ్చిందని తెలిపింది.
జనవరి 27 నాటికి ఉత్తర24 పరగణా జిల్లాలో అదనంగా ఒక్క నిఫా కేసు కూడా నిర్ధరణ కాలేదని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అందుకే భారత్ నుంచి విదేశాలకు నిఫా వ్యాప్తిచెందే రిస్క్ తక్కువగా ఉందనే నిర్ధరణకు వచ్చామని వివరించింది. “విదేశాల సరిహద్దులను ఆనుకొని ఉన్న బంగాల్ రాష్ట్రం- బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్యనున్న ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఫ్రూట్ బ్యాట్ అని పిలిచే గబ్బిలాల జాతులు ఉన్నాయి. ఈ గబ్బిలాల వల్లే బంగ్లాదేశ్‌తో పాటు, దాని సరిహద్దుల్లోని భారతీయ రాష్ట్రాలకు నిఫా ముప్పు ఉంది” అని తెలిపింది.
“కొన్నిసార్లు కలుషిత ఆహారం వల్ల, నిఫా సోకిన వ్యక్తి నుంచి ఈ వైరస్ ప్రబలుతుంటుంది. బహుశా ఆ గబ్బిలాల నుంచి వివిధ మార్గాల ద్వారా బంగాల్లోని ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ సంక్రమించి ఉండొచ్చు. కానీ దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన ఆధారమేదీ లభించలేదు” అని స్పష్టం చేసింది.

More Stories
రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా ప్రాథమిక హక్కే
ఢిల్లీ స్వాట్ కమాండో గర్భిణీ కాజల్ చౌదరిని చంపిన భర్త
పగలు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం!