ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
కాగా, గురువారం సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు.
శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్ సిట్ అధికారులకు గురువారం వ్రాసిన లేఖలో శుక్రవారం విచారణకు హాజరు కాలేనని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌ను ఎక్కడ విచారించాలనే దానిపై సిట్ అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించి, న్యాయ నిపుణులతో చర్చించారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు సిట్ బృందం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడి సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసును అంటించారు.
‘‘పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2024లో క్రైం నెంబర్ 243 కింద నమోదైన కేసు విచారణలో భాగంగా మీకు అందచేసిన నోటీసుకు మీరు పంపించిన జవాబు పరిశీలించాం. ఎన్నికల అఫిడవిట్‌లోనూ, అసెంబ్లీ కార్యాలయం రికార్డుల్లోనూ గజ్వేల్ ఎమ్మెల్యేగా మీరు పేర్కొన్న నందినగర్ ఇంటి చిరునామాకే నోటీసు పంపించాం. మీరు ఎర్రవెల్లికి రమ్మని కోరినప్పటికీ అది సాధ్యం కాదు” అని అందులో స్పష్టం చేశారు.
కేసు విచారణ పరిధి దృష్ట్యా మీరు అధికారికంగా రికార్డుల్లో పేర్కొన్న నందినగర్ నివాసంలోనే విచారిస్తాం అని నోటీసులో పేర్కొన్నారు. కేసు విచారణలో అనేక ముఖ్యమైన ఎలకా్ట్రనిక్ ఆధారాలు, రికార్డులు ఉన్నాయని, ఇందులోని అత్యంత ముఖ్యమైన సమాచారం ఉందని, వీటిని తీసుకుని ఎర్రవెల్లికి రావడం సాధ్యం కాదని చెప్పారు.
సిట్ జారీ చేసిన నోటీసుపై కేసీఆర్ స్పందిస్తూ, తాను ప్రస్తుతం నందినగర్ నివాసంలో ఉండటం లేదని, ఎర్రవెల్లిలో ఉంటున్నానని తెలిపారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద సాక్షిగా విచారణకు రమ్మని సిట్ పంపిన నోటీసులో హైదరాబాద్‌లో తను కోరుకున్న చోట విచారణకు రమ్మని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ గురువారం సిట్ చీఫ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఎర్రవెల్లిలోనే విచారించాలని అందులో కోరారు.

More Stories
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్
బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిపై దర్యాప్తు జరపాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు