ఢిల్లీ స్వాట్ కమాండో గర్భిణీ కాజల్ చౌదరిని చంపిన భర్త 

ఢిల్లీ స్వాట్ కమాండో గర్భిణీ కాజల్ చౌదరిని చంపిన భర్త 
నాలుగు నెలల గర్భిణీ అయిన ఢిల్లీ స్వాట్ కమాండో కాజల్ చౌదరి (24) హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. భర్త అంకుర్, డంబెల్ తో, ఆమెను దారుణంగా హత్య చేసాడు.  ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో ఆమె(కాజల్) సోదరుడు నిఖిల్ (ఈయన కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్) కు ఫోన్ చేశాడు. 
 
‘ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా’ అని చెప్పి, ఆమెపై దాడికి దిగాడు. ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పడం గమనార్హం. జనవరి 22న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్-అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది.
భర్త.. నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టి, ఆపై బరువైన డంబెల్ తో ఆమె తలపై దాడి చేశాడు. దాడి సమయంలో కాజల్ నాలుగు నెలల గర్భిణీ. ఆసుపత్రిలో ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి, జనవరి 27న కమాండో కాజల్ కన్నుమూశారు. కట్నం వేధింపులే తమ బిడ్డ హత్యకు ప్రధాన  కారణమని కాజల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిందితుడు అంకుర్ చౌదరి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. పెళ్లిలో బుల్లెట్ బైక్, బంగారం ఇచ్చినప్పటికీ, కారు ఇవ్వలేదని అతను తరచూ కాజల్‌ను వేధించేవాడని తెలుస్తోంది. పోలీసులు నిందితుడు అంకుర్ చౌదరిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. కాజల్-అంకుర్ దంపతులకు ఇప్పటికే ఒకటిన్నర ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాబు కాజల్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.
నవంబర్ 23, 2023న వివాహం చేసుకున్న కాజల్, కట్నం ఆశతో పెళ్లి అయిన మొదటి నుంచే నిరంతర వేధింపులను ఎదుర్కొందని ఆమె తల్లి వెల్లడించారు. అంకుర్ తల్లిదండ్రులు, తోబుట్టువులు మరింత కట్నం డిమాండ్ చేయడంతో, పెళ్లి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా, తన కుటుంబంతో పాటు ఉంటున్న ఒకటిన్నర సంవత్సరాల కుమారుడికి తల్లి అయిన కాజల్, 2022లో విధుల్లో చేరినప్పటి నుండి ఢిల్లీ పోలీసుల ఉన్నత స్థాయి స్వాట్ యూనిట్‌లో పనిచేస్తూనే ఈ వేధింపులను మౌనంగా భరించింది.