గవర్నర్ ఫోన్ ట్యాప్ చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

గవర్నర్ ఫోన్ ట్యాప్ చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం
 
* అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీవ్ర ఆరోపణలు
 
కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు ఆ రాష్ట్ర శాసనసభలో దుమారం రేపాయి. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం గవర్నర్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసిందని, ఆయనపై నిఘా పెట్టిందని విపక్ష బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్‌ది ట్యాపింగ్‌ సర్కార్‌ అని విమర్శించింది.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్‌భవన్‌ (లోక్‌ భవన్‌)కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ వివరాలను కాంగ్రెస్‌ పొందిందని, వాటిపై నిఘా ఉంచి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. 
కేంద్రం నుంచి ఫోన్ల ద్వారా వచ్చే ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వ్యవహరిస్తున్నారంటూ న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ చేసిన ఆరోపణలు సభలో గొడవకు దారితీశాయి. ఈ చర్చలో బీజేపీ ఎమ్మెల్యే సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ గవర్నర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అగౌరవ పరుస్తున్నదని, రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయనపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నదని విమర్శించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్‌ చదవని ఘటనలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. 

గతంలో జరిగిన ఘటనలను ఆయన ఉదహరిస్తూ జనవరి 2011లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అప్పటి ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆ ప్రసంగాన్ని చదవ వద్దని గవర్నర్‌ను కోరిన తర్వాత, అప్పటి గవర్నర్‌ హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ తన ప్రసంగాన్ని చదివినట్టుగా పరిగణించాలని సంయుక్త సమావేశంలో ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. 

దానికి మంత్రి హెచ్‌కే పాటిల్‌ స్పందిస్తూ ప్రస్తుత గవర్నర్‌ మాత్రం ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్స్‌ ద్వారా వచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీ నుంచి కాల్స్‌ వచ్చిన తర్వాత గవర్నర్‌ ఆ పూర్తి ప్రసంగాన్ని చదవలేదు. అప్పటి గవర్నర్‌ భరద్వాజ్‌ ఘటన గురించి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం దీని గురించి కూడా మాట్లాడాలి’ అని పాటిల్‌ స్పష్టం చేశారు.

మంత్రి వ్యాఖ్యలతో బీజేపీ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. గవర్నర్‌పై మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారని, అసలు గవర్నర్‌ ఫోన్‌కాల్స్‌ గురించి ప్రభుత్వానికి ఎలా తెలుసని బీజేపీ నేత సురేశ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ‘గవర్నర్‌కు ఢిల్లీ నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందా?’ అని ఆయన నిలదీశారు. 

పాటిల్‌ చేసిన ప్రకటన వారు చేసిన తప్పుడు పనిని ఒప్పుకున్నైట్టెందని, రెండుసార్లు దీనిపై మంత్రి సభలో ప్రకటనలు చేశారని, దీనిని ఎలా సహించాలని అంటూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందా? లేదా? అని సునీల్‌ కుమార్‌ ప్రశ్నించారు.

మంత్రి పాటిల్‌ చేసిన ప్రకటనను సమర్థించిన ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే మాట్లాడుతూ కేంద్రం చేతిలో గవర్నర్‌ కేవలం తోలు బొమ్మలా వ్యవహరిస్తున్నారని మాత్రమే ఆరోపించారని తెలిపారు. అయితే దీనిని బీజేపీ నేతలు విభేదిస్తూ లోక్‌ భవన్‌పై సిద్ధరామయ్య ప్రభుత్వం నిఘా ఉంచిందన్న తీవ్ర అనుమానాలను మంత్రి ప్రకటనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలు, వాదోపవాదాలతో గందరగోళం ఏర్పడటంతో ఖర్గే ఆగ్రహంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యాలయం కేశవ కృప నుంచి గవర్నర్‌కు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని పేర్కొనడంతో, కాంగ్రెస్‌కు ఇటలీ నుంచి కాల్స్‌ వచ్చాయంటూ బీజేపీ ప్రతినిధులు ప్రత్యారోపణ చేశారు. శాసనసభ విపక్ష నేత ఆర్‌ అశోక సహా సురేశ్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌లు సిద్ధరామయ్య ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందంటూ తమ ఆరోపణలను కొనసాగించారు. 

తాను గత వారం ఆరోపణలు చేసినప్పుడు దానిపై అటు గవర్నర్‌ నుంచి కాని, అటు హోం మంత్రిత్వ శాఖ నుంచి కాని ఎందుకు వివరణ రాలేదని మంత్రి పాటిల్‌ ప్రశ్నించారు. ‘ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నది? గవర్నర్‌, హోం మంత్రిత్వ శాఖ మధ్య ఎలాంటి సంభాషణలు చోటుచేసుకోలేదని కనీసం ఒక ప్రకటన కూడా ఎందుకు విడుదల చేయలేదు’ అని ఆయన ప్రశ్నించారు.

నిపై విపక్ష నేత అశోక మాట్లాడుతూ ‘మంత్రులు పాటిల్‌, ఖర్గేల ప్రకటనలు చూస్తే లోక్‌భవన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ఫోన్లు ట్యాపింగ్‌ అయిన విషయం రుజువైంది. మా ఫోన్లు కూడా ప్రస్తుతం ట్యాపింగ్‌లో ఉన్నాయా? ఇది ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రభుత్వం’ అని విమర్శించారు. దీనిపై వాదోపవాదాలు కొనసాగడంతో స్పీకర్‌ యూటీ ఖాడెర్‌ సభను లంచ్‌కు వాయిదా వేశారు.

ఈ నెల 22న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన సమయంలో గవర్నర్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం ఆమోదించి ఇచ్చిన ప్రసంగాన్ని చదవకుండా, మూడు వాక్యాల్లో ప్రసంగాన్ని ముగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ప్రసంగంలో కేంద్రం చర్యలపై పలు అభ్యంతర వ్యాఖ్యలతో పాటు ఉపాధి హామీ పథకం మార్పుపై కేంద్రంపై తీవ్ర విమర్శలు ఉన్నాయని, అందుకే దానిని ఆయన చదవలేదని లోక్‌భవన్‌ వర్గాలు వివరించాయి. దీనిపై అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.