జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన తల్లి అంజనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. గురువారం విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును సందర్శించిన ఆయన, అక్కడ ఉన్న రెండు జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది పాటు వాటి సంరక్షణ, ఆహారం, పోషణకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని వెల్లడించారు.

తన కుటుంబమంతా జంతు ప్రేమికులమని, ఈ దత్తత ద్వారా సమాజంలో వన్యప్రాణి సంరక్షణ పట్ల అవగాహన కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సుమారు 650 ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ జూ పార్కును పవన్ కళ్యాణ్ ఆద్యంతం పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించడంతో పాటు, బటర్ ఫ్లై పార్కులో సీతాకోక చిలుకలను విడుదల చేశారు. 
 
ఏనుగులు, పులులు, సింహాలు , ఆఫ్రికన్ చిలుకల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంబాలకొండ ఎకో పార్కులో 50 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నగరవనాన్ని ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యతలో వన్యప్రాణుల పాత్ర కీలకమని, వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 
 
జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావాలని, తమకు నచ్చిన జంతువులను దత్తత తీసుకుని వన్యప్రాణి సంరక్షణలో చేయూతనివ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. విశాఖ జూను అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.