గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి కేసులు, అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవినీతి కేసులు, కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
వివిధ అవినీతి కేసులలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పర లబ్ధి పొందుతున్నాయని ఆయన ఆరోపించారు. ‘ఓటుకు నోటు’ కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆయన పార్టీ రేవంత్ రెడ్డిని రక్షించగా, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో సహా వివిధ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, ఇతరులను రక్షిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వంటి అక్రమాలకు పాల్పడిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గాన్నే అనుసరిస్తోందని రావు ఆరోపించారు. కేవలం కాంట్రాక్టర్లు, మంత్రులు మాత్రమే మారుతున్నారని, కానీ “కమీషన్ల వ్యవస్థ” మాత్రం అలాగే ఉందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం నోటీసులు జారీ చేయడానికే పరిమితమైందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కేసులను వెలికితీస్తానని, అధికారం చేపట్టిన 100 రోజుల్లో కేసీఆర్ను జైలుకు పంపుతానని చెప్పారని బీజేపీ అధినేత గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను ఆయన ఒక “నటన”గా అభివర్ణించారు. అధికారులను బలిపశువులను చేయడం తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రావు మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం “సిట్” విచారణ ఏర్పాటు చేయడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ, రెండున్నరేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ కుటుంబ సభ్యులలో ఒక్కరిని కూడా, లేదా ఏ కీలక నాయకుడిని కూడా జైలుకు పంపలేదని రావు విస్మయం వ్యక్తం చేశారు.
“సిట్” అనేది కేవలం ఒక “సిట్టింగ్” మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రధాన పని అయిపోయిందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కేవలం రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, కానీ అవినీతి కేసుల్లో మాత్రం సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు.

More Stories
కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు