* ఎన్నికల ప్రచారంలో నితిన్ నబిన్, అమిత్ షా
తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం, గెలుపే లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపి, ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించింది.
బిజెపి జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ ఛార్జ్ గా మహారాష్ట్ర మంత్రి అశీష్ షెలార్ ను నియమించారు. రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణామిని సహా ఇన్ ఛార్జ్ గా నియమించారు. వారితో పాటు బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ మంగళవారం నుండి వరుసగా సమావేశాలు జరుపుతున్నారు.
మంగళవారం మహిళా మోర్చా నాయకులతో సమావేశం కాగా, బుధవారం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీతో సమావేశమయ్యారు. రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ దిశానిర్దేశం చేశారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావాలని ఇప్పటికే ఆహ్వానం పంపారు. వారి రాకతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా, ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. రాష్ట్ర నేతలు సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో నితిన్ నబీన్ పర్యటన ఉండనుంది. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీ బలాన్ని చాటాలని చూస్తున్నారు.
ఇక అత్యంత కీలకమైన పర్యటనగా భావిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్ జిల్లాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో నిర్మల్ వేదికగా జరిగిన సభలు పార్టీకి మంచి మైలేజీని ఇచ్చిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ అమిత్ షా ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర బీజేపీ నేతలు యోచిస్తున్నారు.
ఈ అగ్రనేతల పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు రూట్ మ్యాప్‌పై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుకొని మారుమూల మున్సిపాలిటీల వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ, జాతీయ నేతల రాకతో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది. ఈ పర్యటనలు విజయవంతమైతే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

More Stories
శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో బడా కుట్ర
మేడారంలో అట్టహాసంగా గద్దెపైకి చేరుకున్న సారెలమ్మ
అజిత్ పవార్ మరణంలో కుట్ర లేదు