లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న సారలమ్మ బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. దీనితో మహా జాతర తొలిఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది. కన్నెపల్లిలోని గుడి నుంచి సారలమ్మ బుధవారం రాత్రి 7.38 గంటలకు బయలు దేరింది. జంపన్నవాగు వద్దకు 8.48 గంటలకు చేరుకున్నది. అక్కడి నుంచి అశేష భక్తజనం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠించారు.
అమ్మను పూజారులు మేడారంలోని గద్దెకు తరలించే ఘట్టం భక్తులను దివ్యానుభూతికి లోను చేసింది. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలైంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని పూజారుల కుటుంబ సభ్యులు తొలుత శుద్ధి చేశారు. గుడి లోపల, బయట అలికి ముగ్గులు వేసి మామిడి తోరణాలు, బంతి పూలతో అందంగా అలంకరించారు. సాయంత్రం అసలైన పూజాతంతు మొదలైంది. పూజా మందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర వడ్డెలు రహస్య పూజలు చేశారు.
లోపల పూజలు జరుగుతున్నంతసేపూ గుడి బయట ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. సారలమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. శివసత్తులు శిగమూగారు. మరోవైపు సారలమ్మ రాకను కళ్లారా చూడాలన్న తపనతో వేలాదిగా భక్తులు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో కన్నెపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకూ గుడి లోపల పూజలు జరిగాయి.
పూజారి కాక సారయ సారలమ్మ ప్రతి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరుతున్న సంకేతం అందగానే అప్పటి వరకు గుడి బయట వేచివున్న వేలాది భక్తజనం శిగమూగారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు పట్టారు. గుడిలో హారతి ఇచ్చి గంటానాథం, బూరకొమ్ము ధ్వనితో మహిళలు గుడి ముందర తడిబట్టలతో సాగిలపడ్డారు. పూజారి సారయ్య సారలమ్మ తల్లి రూపాన్ని తలకెత్తుకొని గుడిబయట అడుగు పెట్టగానే భక్తుల కేరింతలతో తల్లికి స్వాగతం పలికారు.
అద్వితీయమైన అనుభూతితో నిలువెల్లా పులకించి పోయారు. దారికి అడ్డంగా పడుకున్న మహిళలపై పసుపు కుంకుమలు, అక్షింతలు, శుద్ధ జలాన్ని చల్లుతూ వారిని దాటుకుంటూ సారయ్య.. తల్లితో ముందుకు సాగారు. సారలమ్మ తల్లి రూపాన్ని తాకాలన్న తపనతో వడ్డెల వద్దకు చేరుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ముందుకు చొచ్చుకువచ్చారు. అయితే.. రోప్ పార్టీలు వడ్డెలకు రక్షణ వలయంగా నిలబడి దారి కల్పించారు.
భక్తులు చొచ్చుకు రాకుండా అడ్డుగా నిలిచారు. సారలమ్మ మేడారంవైపు సాగివస్తుండగా కన్నెపల్లి గ్రామస్థులు ఎదురెళ్లి హారతులు ఇచ్చారు. తమ ఇళ్ల ముందు నిల్చొని స్వాగతం పలికారు. మహిళలే తల్లి ప్రయాణించే మార్గంలో అడుగడుగునా నీళ్లారబోశారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చారు. మొక్కులను సమర్పించుకున్నారు.
కన్నెపల్లి నుంచి మేడారం వరకు 2 కిలోమీటర్ల మేర దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చున్నారు. తల్లికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వద్దకు వచ్చిన తర్వాత వాగు ఒడ్డున కొద్దిసేపు తల్లికి జంపన్న తరఫున ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంపన్నవాగు దాటుతుండగా భక్తులు జయజయధ్వానాలు చేశారు.
వాగుకు ఇటువైపున ఒడ్డుపై ప్రతిష్ఠితమైన నాగులమ్మ వద్ద కూడా పూజారులు కొద్దిసేపు ఆగారు. అక్కడ కూడా నాగులమ్మ పక్షాన సారలమ్మకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మను తీసుకువచ్చారు.

More Stories
మున్సిపల్ ఎన్నికల వ్యూహంలో బిజెపి కేంద్ర నాయకులు
శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో బడా కుట్ర
అజిత్ పవార్ మరణంలో కుట్ర లేదు