బంగ్లా జైలు నుంచి విశాఖ మత్స్యకారుల విడుదల

బంగ్లా జైలు నుంచి విశాఖ మత్స్యకారుల విడుదల

అలల కడలిలో ఆటుపోట్లు. సరిహద్దు దాటితే సంకెళ్లు. జైల్లో జాలరులు – కన్నీటి సంద్రంలో కుటుంబ సభ్యులు. వేటకెళ్లి బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌లకు చిక్కిన విశాఖ మత్స్యకారులకు మిగిలిన చేదు అనుభవం ఇదే. ఆర్నెళ్లపాటు బంగ్లా జైల్లో బందీ అయిన విశాఖ జాలరులు ఎట్టకేలకు విడుదలయ్యారు. కళ్లలో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులు సంతోషంలో మునిగిపోయారు.

భారత జాలరులు ఆర్నెళ్లపాటు బంగ్లాదేశ్‌ చెరలో మగ్గారు. ‍‌ఇందులో 9 మంది విశాఖ జిల్లాకు చెందిన మత్స్యకారులూ ఉన్నారు. గతేడాది వేటకెళ్లిన వీరినిని తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఆర్నేళ్లు అక్కడి జైల్లో నరకయాతన అనుభవించారు. 

వీరిని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేట్టినా, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఇతరత్రా కారణాలు విడుదలలో జాప్యానికి దారి తీశాయి. అసలు తమ వారు తిరిగొస్తారా? రారా? అనే సందిగ్ధంలో ఉండిపోయిన మత్స్యకార కటుంబాలు ఇప్పుడు విడుదలయ్యారని తెలుసుకుని సంతోషంలో మునిగిపోయాయి.

బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గతేడాది అక్టోబరు 22న ఎంఎం 735 బోటులో చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకుంది. బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు కూటమి నేతల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

అక్కడి జైలులో ఉన్న 23 మంది మత్స్యకారులను విడుదల చేసేందుకు ఆ ప్రభుత్వం అంగీకరించింది. వారిలో విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులు ఉన్నారు.  బంగ్లాదేశ్ హోంమంత్రి, ఇతర అధికారులు, భారత డిప్యూటీ హై కమిషనర్ చంద్రజీత్ సమక్షంలో బందీలను విడుదల చేశారు. బాగర్హాట్ జైల్ నుంచి విడుదలైన మత్స్యకారుల్ని, మోంగ్లా పోర్టుకు తరలించారు. 

పోర్టుకు చేరాక మత్స్యకారులు తమ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇన్నాళ్లూ ఫొటోల్లో చూసుకున్న తమవారిని ప్రత్యక్షంగా చూడబోతున్నామంటూ బంధువులు ఉద్విగ్నానికి లోనయ్యారు. తమవారి విడుదలకు తోడ్పడిన కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ పోలీసులు సీజ్ చేసిన భారత్ జాలర్ల బోట్ల రిపేర్లు పూర్తి చేసి ఈనెల 29 నాటికి మత్స్యకారులు భారత్‌ చేరుకునే అవకాశం ఉంది.