చండీగఢ్‌ లో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

చండీగఢ్‌ లో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
చండీగఢ్‌ నగరంలో బుధవారం ఉదయం 20కి పైగా స్కూళ్లకు ఇ – మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులొచ్చాయి. దీంతో పోలీసులు 26 స్కూళ్లలో విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపి పాఠశాలలను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
చండీగఢ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పి) వివరాల ప్రకారం సెయింట్‌ కబీర్‌ పబ్లిక్‌ స్కూల్‌, వివేక్‌ హై స్కూల్‌, భవన్‌ విద్యాల, సేక్రెడ్‌ హార్ట్‌ స్కూల్‌, చిత్కార స్కూల్‌ సహా కనీసం 26 పాఠశాలలకు, పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇమెయిల్‌ ద్వారా ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  ఈ నేప‌థ్యంలో చండీఘ‌డ్‌లో ఎమ‌ర్జెన్సీ సైర‌న్ల‌ను మోగించారు.
 
వెంటనే పోలీసులు పాఠశాలలకు చేరుకుని ఉపాధ్యాయులను, విద్యార్థులను త్వరత్వరగా పాఠశాల నుంచి బయటకు పంపారు. త్వరగా తమ చిన్నారులను ఇళ్లకు తీసుకెళ్లమని పోలీసులు తల్లిదండ్రుల్ని కోరారు. ఈ ఘటన సమయంలో తానెంతో భయాందోళనలకు గురయ్యాయనని నిమిర్దీప్‌ బ్రార్‌ అనే ఓ చిన్నారి తండ్రి చెప్పారు. 
 
‘నేను నా కూతుర్ని స్కూల్‌లో డ్రాప్‌ చేయడానికి వెళ్లినప్పుడు.. ఓ టీచర్‌ పరుగెత్తుకుంటూ వచ్చి వెంటనే ఇంటికి వెళ్లండి అని చెప్పారు’ అని ఆ ఉద్విగ క్షణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో సెక్టార్‌ 20 గురుద్వారా సమీపంలో అత్యవసర పరిస్థితిలా అనిపించింది అని మరొక తల్లి ఆరాధన బన్సాల్‌ చెప్పారు. 
 
పోలీసు బృందాలు, బాంబు నిర్వీర్య బృందాలు పాఠశాలల ఆవరణలో తనిఖీలు చేపట్టాయి. విద్యా సంస్థలకు ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపులతో స్కూళ్ల గేట్ల ముందు వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. పిల్లలు లేదా సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రోటోకాల్‌లను అనుసరించినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపుల వచ్చిన ఇ-మెయిల్‌ని పోలీసులు ట్రేస్‌ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.