కేంద్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టిందని, ప్రజా నిధులను సముచితంగా ఉపయోగించుకునేలా చూసుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రపంచ రాజకీయాల లక్ష్యం మానవాళికి సేవ చేయడమేనని భారతదేశం విశ్వసిస్తుందని పేర్కొంటూ నకిలీ, తప్పుడు సమాచారం, నకిలీ కంటెంట్ ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యానికి పెద్ద ప్రమాదమని ఆమె హెచ్చరించారు.
బుధవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ఆమె అవినీతి రహిత వ్యవస్థను నిర్మించడానికి, “ప్రతి రూపాయి భారతదేశ అభివృద్ధి కోసమే ఖర్చు అయ్యేలా” చూడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమంలో భారతదేశం సాధించిన పురోగతిని ప్రశంసించారు. దేశపు వేగవంతమైన పురోగతిని “ప్రపంచ చర్చకు ఒక అంశం” అని ఆమె తెలిపారు.
రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, “నా ప్రభుత్వం దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, ప్రతి ఒక్కరి కోసం పూర్తి సున్నితత్వంతో పనిచేస్తోంది. ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అనే దార్శనికత ప్రతి పౌరుడి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2014 ప్రారంభంలో, సామాజిక భద్రతా పథకాలు కేవలం 25 కోట్ల మంది పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు సుమారు 95 కోట్ల మంది భారతీయులకు సామాజిక భద్రతా పథకాలు అందుబాటులో ఉన్నాయి.” అని పేర్కొన్నారు.
తన ప్రభుత్వ ప్రగతిశీల ఆలోచనా విధానం, విధానాల ఫలితంగా, దేశంలోని ప్రతి ప్రతిష్టాత్మక రంగంలో మహిళలు వేగంగా ముందుకు దూసుకెళ్లారని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. “ఈ దిశగా, కొన్ని నెలల క్రితం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) నుండి మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణులైనప్పుడు దేశం మరో పెద్ద మైలురాయిని సాధించింది. దేశాభివృద్ధి, సాధికారతలో ‘నారీ శక్తి’ అగ్రస్థానంలో ఉంటుందనే నమ్మకాన్ని ఇది మరింత బలపరిచింది” అని తెలిపారు.
దేశంలో సామాజిక న్యాయానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. దేశంలోని దాదాపు 95 కోట్ల మంది పౌరులకు ఇప్పుడు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. మొబైల్ తయారీలో భారతదేశం రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదగడాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
గత పదేళ్లలో 25 కోట్లమందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని, 100 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని ఆమె వెల్లడించారు. వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించామని, ప్రస్తుతం దేశంలో 150కిపైగా వందేభారత్ రైళ్లు ఉన్నాయని తెలిపారు. భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోబోతోందని వెల్లడించారు.
ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంపై దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు రాష్ట్రపతి ముర్ము. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పన్ను సంస్కరణలు రూపొందుతున్నాయని ఆమె చెప్పారు. దేశం పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోందని, దేశ అణువిద్యుత్ సామర్థ్యం క్రమంగా పెరుగుతోందని ఆమె తెలిపారు.
“గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చాం. దేశాభివృద్ధిలో మహిళలకు కీలకపాత్ర కల్పించాం. ఆపరేషన్ సిందూర్ మన సైన్యం సత్తా చాటింది. భారత్‌పై దాడిచేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసింది. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. నానో చిప్‌ల తయారీపైనా భారత్ దృష్టి సారించింది” అని రాష్ట్రపతి వివరించారు.
“మైక్రో చిప్‌ల తయారీలో స్వయంసమృద్ధి సాధించాలి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగాం. ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు భారీగా రుణాలు ఇచ్చాం. పీఎం విశ్వకర్మ జన ద్వారా 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. 95 కోట్లమందికిపైగా సామాజిక భద్రత కల్పించాం” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.

More Stories
ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
బంగ్లాదేశ్‌లో బలపడుతున్న ఇస్లామిక్ పార్టీ జమాతే ఇస్లామీ
పార్లమెంట్ లో కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు