రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఒకరు వీడియో విడుదల చేశారు. అయితే ఆ మహిళే తన కుమారుడిని వేధిస్తోందంటూ ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మీడియాకు తెలిపారు.
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టానని, ఆ తర్వాత ఆయన తనతో ఫోన్‌లో మాట్లాడారని సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు.
2024 జూలైలో తనను కారులో ఎక్కించుకుని వెళ్లి, రాజంపేట ప్రాంతంలో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై అనేకసార్లు అత్యాచారం చేశారని, తీవ్రంగా హింసించేవారని ఆరోపించారు. ఆగస్టులో గర్భం దాల్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అబార్షన్ చేయించుకున్నానని, విడాకులు ఇవ్వాలంటూ తన భర్తను కూడా బెదిరించారని చెప్పారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఎమ్మెల్యే శ్రీధర్ ఒక వీడియో విడుదల చేశారు.
‘‘నేను ఎమ్మెల్యే కావడానికి ముందు మూడేళ్లు సర్పంచుగా పని చేశా. నాపై ఎలాంటి ఆరోపణలూ రాలేదు. ఇప్పుడు నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న వారితోపాటు వారి వెనకున్న వారిని చట్టపరంగా ఎదుర్కొంటా. ఆ మహిళ గత ఆరు నెలలుగా నన్ను వేధిస్తుంటే మా అమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు’’ అని తెలిపారు.
కాగా, బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి, ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని శైలజ స్పష్టం చేశారు.
అయితే, ఆ మహిళా ఆరోపణలను శ్రీధర్ తల్లి ప్రమీల ఖండించారు. “కులం పేరు చెప్పి నా కొడుకుకు దగ్గరైంది. క్రమంగా ఇంటికి రావడం మొదలు పెట్టింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేది. పెళ్లి చేసుకోవాలంటూ అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసింది. ఆమె వేధింపులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాం” అని ఆమె చెప్పుకొచ్చారు.
రైల్వే కోడూరు పోలీసులు ఆమెపై ఈనెల 7వ తేదీన కేసు నమోదు చేశారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామని ప్రమీల తెలిపారు. కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆ ఉద్యోగిని చేసిన ఆరోపణలు అవాస్తమని, అతి త్వరలో ఆమె బాగోతాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెడతామని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు.

More Stories
బిజెపిపై ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలి
సింహాచలంలో అత్యంత వైభవంగా రథసప్తమి మహోత్సవాలు
కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్ తో చంద్రబాబు భేటీ