కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ప్రాతిపదిక వివక్షను కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన కొత్త నిబంధనలపై వివాదం రేగింది. ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతాయని, తప్పుడు ఫిర్యాదులకు శిక్ష విధించే నిబంధన లేదని అనేక వర్గాలు యూజీసీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర విద్యాశాఖ కింద కేంద్ర ప్రభుత్వం స్థాపించిన స్వయం ప్రతిపత్తితో కూడిన యూజీసీ జనవరి 13న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది.
అయితే, ఆందోళనకు స్పందిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ “ఎటువంటి వివక్షత ఉండదు, ఎవరూ చట్టాన్ని దుర్వినియోగం చేయలేరు” అని భరోసా ఇచ్చారు. నిబంధనలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్, 2026 పేరిట జారీచేసిన ఈ నిబంధనల ప్రకారం వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు ప్రత్యేకంగా ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ క్యాటగిరీలకు చెందిన విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి 24/7 గ్రీవెన్స్ హెల్ప్‌లైన్ల ఏర్పాటుతోపాటు సమాన అవకాశాల కేంద్రాలను, సమానత్వ కమిటీలను అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
యూజీసీ నిబంధనలలో “కుల ఆధారిత వివక్ష” అనే పదజాలం ఎలా నిర్వహిస్తారనే అంశంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయం వెలుపల అగ్రవర్ణ వర్గాల విద్యార్థులు మంగళవారం నిరసనలు జరిపారు. విద్యార్థులు, బోధన, భోధనేతర సిబ్బంది, పాలనాధికారులతోసహా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని విభాగాల సభ్యులకు యూజీసీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి.
ఈ నియమాలు వివక్షను విస్తృతంగా నిర్వచించాయి. బహిరంగ చర్యలను మాత్రమే కాకుండా సమాన గౌరవాన్ని దెబ్బతీసే లేదా మానవ గౌరవాన్ని ఉల్లంఘించే సూక్ష్మ లేదా పరోక్ష పద్ధతులు కూడా వివక్ష కిందకు వస్తాయి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ సభ్యులతోపాటు ఆర్థికంగా బలహీన వర్గాలు, దివ్యాంగుల రక్షణపై ఈ నిబంధనలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తాయి.
వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, నమోదు చేసి, పరిష్కరించే వ్యవస్థలను ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. నిత్య పర్యవేక్షణ, అంతర్గత నివేదన యంత్రాంగాల ఏర్పాటు తప్పనిసరి. ఈ నిబంధనలకు చట్టపరంగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. నిబంధనలకు కట్టుబడని విద్యా సంస్థలకు అకడమిక్ ప్రోగ్రామ్‌ల తిరస్కరణ, యూజీసీ ఫండింగ్ పథకాలకు అనర్హత లేదా సంస్థాపరమైన గుర్తింపు ఉపసంహరణసహా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు జనరల్ క్యాటగిరీ విద్యార్థులపై వివక్షకు దారితీస్తాయని, వేధింపులకు పాల్పడుతున్నది వారేనన్న భావనను కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. తప్పుడు ఫిర్యాదులు లేదా దురుద్దేశపూర్వక ఫిర్యాదులకు పాల్పడే నిందితులపై ఏ విధమైన చర్యలు తీసుకునేది ప్రస్తావించకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
కమిటీ నివేదికపై నిందితుడు అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇవ్వడం, అప్పీలుపై నిర్ణయం తీసుకునేందుకు అంబుడ్స్‌మన్‌కు మరో 30 రోజుల వ్యవధి ఇవ్వడం నిబంధనలలో పొందుపరిచినప్పటికీ తప్పుడు ఫిర్యాదులని రుజువైతే తీసుకునే శిక్షార్హమైన పర్యవసానాలు ఏమిటో చెప్పకపోవడాన్ని విమర్శిస్తున్నారు.
యూజీసీ సవరించిన నిబంధనలపై పెరుగుతున్న అసంతృప్తి మధ్య, కేంద్ర ప్రభుత్వం కొత్త యూజీసీ నిబంధనలపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను సంప్రదించిందని అధికార వర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనల వివిధ అంశాలపై ప్రభుత్వం ఇద్దరు న్యాయ నిపుణుల నుండి కీలకమైన సలహాలను కోరింది.
కాగా, కుల ఆధారిత వివక్షకు సంబంధించిన ఒక సమగ్ర నిర్వచనాన్ని యూజీసీ స్వీకరించిందని, సంస్థాగత రక్షణ నుండి కొన్ని వర్గాలను మినహాయించిందని ఆరోపిస్తూ, ఇటీవల నోటిఫై చేసిన యూజీసీ నిబంధనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. వినీత్ జిందాల్ దాఖలు చేసిన పిటిషన్, కుల ఆధారిత వివక్షను షెడ్యూల్డ్ కులాలు (ఎస్సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబిసి) సభ్యులపై వివక్షగా ఖచ్చితంగా నిర్వచించారనే కారణంతో నిబంధనను తీవ్రంగా వ్యతిరేకించింది.

More Stories
బంగ్లాదేశ్‌లో బలపడుతున్న ఇస్లామిక్ పార్టీ జమాతే ఇస్లామీ
పార్లమెంట్ లో కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
భారత్-ఈయూ ఒప్పందం తర్వాత ఏవి చౌకగా మారతాయి?