పలువురు బ్రిటిష్ ప్రధానుల సన్నిహితుల ఫోనులు హ్యాక్ చేసిన చైనా

పలువురు బ్రిటిష్ ప్రధానుల సన్నిహితుల ఫోనులు హ్యాక్ చేసిన చైనా
పలువురు యూకే ప్రధానుల సన్నిహితుల మొబైల్ ఫోన్లను సైబర్ దాడులతో  చైనా హ్యాక్ చేసిందని ఆరోపిస్తూ బ్రిటిష్ పత్రిక ‘ది టెలిగ్రాఫ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. డౌనింగ్ స్ట్రీట్‌‌లోని పలువురు సీనియర్ అధికారుల మొబైల్ ఫోన్లను చాలా ఏళ్లుగా హ్యాక్ చేస్తోందని ఆరోపించింది.  టెలిగ్రాఫ్ పత్రిక ఆరోపణలపై చైనా నుంచి ఏలాంటి తక్షణ స్పందన వెలువడలేదు.
పైగా, బ్రిటిష్ ప్రధాని కేర్ స్టార్మర్ జనవరి 28న మూడు రోజుల చైనా పర్యటనకు వెళ్లనున్న వేళ టెలిగ్రాఫ్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  2021 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన ఈ సైబర్ దాడులు, అప్పటి ప్రధానులైన బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల సన్నిహితులను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఈ కధనంతో అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో చైనాకు దగ్గరయ్యేందుకు స్టార్మర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇబ్బందికరంగా మారాయి. 
 
కీర్ స్టార్మర్ చైనాపర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. బ్రిటన్ వాణిజ్య మంత్రి పీటర్ కైల్ సహా చాలా మంది కార్పొరేట్ నాయకులు కూడా స్టార్మర్‌తో పాటు వెళ్తున్నారు.  చైనా సాంకేతికత, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ వంటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో మరింత విస్తరించాలని బ్రిటన్ ఆశిస్తోంది. 
 
అయితే, ఈ పర్యటనకు ముందే వచ్చిన ఈ హ్యాకింగ్ ఆరోపణలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం ‘సాల్ట్ టైఫూన్’ అనే కోడ్ పేరుతో జరిగిన ఈ సైబర్ దాడి డౌనింగ్ స్ట్రీట్‌లోని కీలక అధికారుల ఫోన్లను లక్ష్యంగా చేసుకుంది.  ప్రధానుల వ్యక్తిగత ఫోన్లు ప్రభావితమయ్యాయో లేదో స్పష్టంగా తెలియకపోయినా, ఈ హ్యాకింగ్ ‘డౌనింగ్ స్ట్రీట్‌ను ప్రభావితం చేసింది’ అని నివేదిక పేర్కొంది.  గత నవంబర్‌లో బ్రిటన్ గూఢచార సంస్థ ఎంI5 పార్లమెంట్‌కు చైనా గూఢచర్య బెదిరింపుల గురించి హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం. 
 
ఇటీవల, బ్రిటన్ ప్రభుత్వం చైనాకు చెందిన రెండు టెక్ కంపెనీలపై సైబర్ దాడుల ఆరోపణలపై ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ మాట్లాడుతూ  ‘చట్టానికి అనుగుణంగా హ్యాకింగ్ కార్యకలాపాలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది, అణిచివేస్తుంది. అదే సమయంలో, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని కూడా గట్టిగా వ్యతిరేకిస్తుంది’ అని చెప్పారు.

కీర్ స్టార్మర్ చైనా పర్యటన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలలో కూడా కొన్ని మార్పులను సూచిస్తోంది. లండన్ మేయర్‌పై ట్రంప్ విమర్శలు, బ్రిటన్ వలస విధానంపై వ్యాఖ్యలు, బీబీసీపై 10 బిలియన్ డాలర్ల దావా వంటి వాటిని స్టార్మర్ గతంలో పట్టించుకోలేదు. కానీ ఇటీవల, గ్రీన్‌లాండ్‌ విషయంలో ట్రంప్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. అఫ్గనిస్థాన్‌లో నాటో దళాల పాత్రపై ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను స్టార్మర్ ఖండించారు.