తెలంగాణాలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు

తెలంగాణాలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు
తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని సమావేశం నిర్వహించిన అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ ను మంగళవారం విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. 
 
ఈ నెల 28 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడవు ముగియనుంది. ఈ నెల 31న స్క్రూటినీ నిర్వహించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 1న తిరస్కరణకు గురైన నామినేషన్‌లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నామినేషన్‌ల ఉపసంహరణకు తుదిగడువు. అదేరోజు అభ్యర్థులు తుది జాబితా ప్రకటించనున్నారు.

“116 మున్సిపల్‌ స్థానాలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, గడువు ముగిసిన వాటిని, కొత్తగా ఏర్పడిన వాటికి ఈ ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్లు మొదలవుతాయి. 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది” అని రాణి కుముదిని తెలిపారు. 

 
ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఉంటుందని రాణి కుముదిని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగనుండగా, 8,203 పోలింగ్‌ కేంద్రాలు, 136 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సీఎస్, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల 43 వేల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్ స్థానాలను పరిశీలిస్తే బీసీ జనరల్‌- 463, బీసీ మహిళలు- 391, ఎస్సీ జనరల్‌- 254, ఎస్సీ మహిళలు- 190, ఎస్టీ జనరల్‌- 147, ఎస్టీ మహిళలు- 40, జనరల్‌ వార్డులు- 647, జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ వార్డులు- 864గా ఉన్నాయి.