తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, బిజెపి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిజెపి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను పట్టించుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ధర్నా కార్యక్రమం రిటైర్మెంట్ ప్రయోజనాల వాయిదాలను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుప్రసంగిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం బిజెపి చేపట్టిన ఈ ఉద్యమం కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలకూ సంబంధించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం సాకారమైతే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశించారని, కానీ రాష్ట్రంలో ఉద్యోగాల పరిస్థితి ఇంకా దారుణంగా మారిందని, పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో “ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ రోజున గౌరవంగా, అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలు ఒకేసారి అందించాలని, రిటైర్ అయ్యే రోజు ఉద్యోగిని ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపించాలని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆయన విమర్సించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ, డీఏలు, గ్రాట్యూటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలను నిలిపివేసిందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణాలో తప్పా దేశంలో ఎక్కడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవని ఆయన మండిపడ్డారు. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
గతేడాది మార్చిలో ఉప ముఖ్యమంతిర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ “ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తాం, ఏడాదిలో అన్ని బిల్లులు క్లియర్ చేస్తాం” అని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు మనస్తాపంతో మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు రూ. 4,000 భృతి ఇస్తామని చెప్పి మాటతప్పిందని, ప్రస్తుత ప్రభుత్వంలోనూ టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలతో కోర్ట్‌లో కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితని ఆయన విచారం వ్యక్తం చేశారు.

More Stories
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అంతా రహస్యమే!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మానస’కు సిఎస్ఆర్ సహాయం
ప్రతి బొగ్గు గని కార్మికుడి ప్రాణం విలువైనదే!