కీలక జనరల్స్ తొలగింపుతో గందరగోళంలో చైనా సైన్యం

కీలక జనరల్స్ తొలగింపుతో గందరగోళంలో చైనా సైన్యం
 
*  జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు యత్నం?
 
ఒకప్పుడు అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు సన్నిహితుడు, రెండవ స్థానంలో ఉన్న చైనా అగ్ర జనరల్ పతనం ఆ దేశ సైనిక నాయకత్వాన్ని గందరగోళంలోకి నెట్టివేసింది. తైవాన్ భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తింది. సాయుధ దళాలను నియంత్రించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా దర్యాప్తులో ఉన్నారని, తీవ్రమైన “క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు” పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 
 
జాయింట్ స్టాఫ్ డిపార్ట్‌మెంట్ బాధ్యత వహించిన మరో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్, కమిషన్ దిగువ సభ్యుడు లియు జెన్లీని కూడా దర్యాప్తులో ఉంచినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ప్రకటన వారిపై ఉన్న ఆరోపణలు లేదా వారు ఎదుర్కొంటున్న అభియోగాల గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
 
అయితే, దేశ సాయుధ దళాల అధికార పత్రిక అయిన లిబరేషన్ ఆర్మీ డైలీలో  ప్రచురితమైన ఒక సంపాదకీయం ప్రకారం, 75 ఏళ్ల జాంగ్‌పై అవినీతికి పాల్పడినట్లు, బహుశా జి పట్ల అవిశ్వాసంతో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. జాంగ్, లియు, సైనిక కమిషన్ ఛైర్మన్ అయిన జి ఆధ్వర్యంలోని బాధ్యతాయుత వ్యవస్థను “తీవ్రంగా కాలరాసి, బలహీనపరిచారని” ఆ సంపాదకీయం పేర్కొంది.  ఈ ఇద్దరూ “సైన్యంపై పార్టీకి ఉన్న సంపూర్ణ నాయకత్వాన్ని బలహీనపరిచే రాజకీయ, అవినీతి సమస్యలను తీవ్రంగా ప్రోత్సహించారని,” ఇది చైనా యుద్ధ సన్నద్ధతకు “అపారమైన హాని కలిగించిందని” కూడా అది తెలిపింది.
 
జిన్‌పింగ్‌కు దీర్ఘకాలంగా సన్నిహితుడుగా ఉన్న, 1979లో వియత్నాంతో జరిగిన సంఘర్షణలో పాల్గొన్న యుద్ధ వీరుడైన జాంగ్‌ను తొలగించడాన్ని కొంతమంది విశ్లేషకులు ఇప్పటివరకు జరిగిన అత్యంత ముఖ్యమైన తొలగింపుగా భావిస్తున్నారు. ఇది చైనా సైనిక అధికార స్వరూపంలో అగ్రస్థానంలో పెద్ద ప్రకంపనలను సృష్టిస్తుందని వారు పేర్కొంటున్నారు.
 
కాగా, అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా జాంగ్‌, ఇతర జనరల్స్‌ తిరుగుబాటుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ జనరల్స్‌లో కొందరు హత్యకు గురైనట్లు తెలుస్తున్నది. చైనాలో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శే సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌(సీఎంసీ) అధ్యక్షుడు, చైర్మన్‌ పదవుల్లో ఉండడం విశేషం. చైనా సైన్యం సీఎంసీ నియంత్రణలో ఉంటుంది. 
 
ప్రస్తుతం జిన్‌పింగ్‌ ఈ మూడు కీలక పదవులనూ తానే నిర్వహిస్తున్నారు. జీ కన్నా ఒక ర్యాంకు తక్కువగా సీఎంసీ ఉపాధ్యక్షుడి హోదాలో జాంగ్‌ ఉన్నారు. చాలాకాలంగా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. జాంగ్‌ తండ్రి జాంగ్‌ జోంగ్‌జన్‌, జీ పిన్‌పింగ్‌ తండ్రి జీ జోంగ్‌జన్‌ ఇద్దరూ షాన్‌జీ ప్రావిన్సులోని వైనాన్‌ ప్రాంతానికి చెందినవారు. 
 
1949లో మావో జెడాంగ్‌ సారథ్యంలో జరిగిన చైనా విప్లవ కాలంలో వారిద్దరూ సైన్యం జనరల్స్‌గా పనిచేశారు. ఈ విప్లవమే పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా స్థాపనకు దారితీసింది. విప్లవ కాలం నాటి కీలక నాయకులు, ప్రముఖ సైనికాధికారుల కుమారులను యువరాజులుగా ప్రస్తావిస్తుంటారు. జాంగ్‌ కూడా అలాంటి యువరాజులలో ఒకరు. 
 
1968లో తన 18వ ఏట చైనా సైన్యంలో చేరిన జాంగ్‌ 1979 నాటి చైనా-వియత్నాం యుద్ధంలో ఆయన క్షేత్రస్థాయిలో పనిచేశారు. యుద్ధానంతరం ఆయన వృత్తిపరంగా వేగంగా ఎదిగారు. 2000 ఆగస్టులో 13వ గ్రూపు ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన జాంగ్‌ 2011లో పూర్తిస్థాయి జనరల్‌గా పదోన్నతి పొందారు. 2012లో జీ జిన్‌పింగ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక చైనా ఆయుధ వ్యవస్థలకు చెందిన జనరల్‌ ఆర్మమెంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతిగా నియమితులయ్యారు.
2017 అక్టోబర్‌లో పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులైన జాంగ్‌ 2020లో సీఎంసీ వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. అమెరికాకు కీలకమైన అణ్వస్ర్తాలకు సంబంధించిన సమాచారాన్ని లీక్‌ చేశారన్న ఆరోపణలపై జనరల్‌ జాంగ్‌ యూజియాపై చైనా దర్యాప్తు ప్రారంభించింది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలపై జాంగ్‌పై దర్యాప్తు చేపట్టినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఇతర వివరాలను తెలియజేయలేదు.