Screenshot
* ఆపరేషన్ సిందూర్’పై స్విస్ రక్షణ నిపుణుల సంచలన నివేదిక
భారత వాయుసేన శక్తి సామర్థ్యాల వల్లే, భారత్ ఆపరేషన్ సిందూర్‌ను మొదలుపెట్టిన నాలుగో రోజునే(2025 మే 10న) కాల్పుల విరమణ మహా ప్రభో అంటూ పాక్ చర్చలకు వచ్చిందని పేర్కొంటూ ‘ఆపరేషన్ సిందూర్’పై స్విట్జర్లాండ్‌కు చెందిన రక్షణరంగ అధ్యయన సంస్థ ‘సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్‌స్పెక్టివ్ స్టడీస్’ (సీహెచ్‌పీఎం) సంచలన నివేదికను విడుదల చేసింది.
వైమానిక శక్తి సామర్థ్యాల విషయంలో పాక్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని ఆనాడు కనబర్చిందని పేర్కొంది. ఆ కీలక పరిణామం దక్షిణాసియా ప్రాంతంలో వైమానిక శక్తి సామర్థ్యాల రేసులో వచ్చిన నిర్ణయాత్మక మార్పును వెలుగులోకి తెచ్చిందని విశ్లేషించింది. సీహెచ్‌పీఎం సంస్థ తరఫున స్విట్జర్లాండ్‌కు చెందిన సైనిక వ్యవహారాల చరిత్రకారుడు అడ్రియెన్ ఫాంటనెల్లాజ్ సారథ్యంలోని నిపుణుల టీమ్ ఆపరేషన్ సిందూర్‌పై సమగ్ర అధ్యయనం చేసింది.
ఇందులో భాగంగా 2025 మే 7 నుంచి మే 10 వరకు 88 గంటల వ్యవధిలో భారత్, పాక్ మధ్య వివిధ చోట్ల జరిగిన సైనిక ఘర్షణల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. ఏయే చోట్ల ఎలాంటి సైనిక ఘర్షణ జరిగింది? ఏయే తరహా ఆయుధాలతో దాడులు చేసుకున్నారు? ఏ దేశ సైన్యం ఆధిపత్యాన్ని కనబర్చింది? అనే అంశాలను పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలన్నీ కలిపి రూపొందించిన నివేదికను తాజాగా సీహెచ్‌పీఎం సంస్థ ప్రచురించింది.
“ఆపరేషన్ సిందూర్‌ను మొదలుపెట్టిన తొలి రోజున (మే 7న) తెల్లవారుజామున ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. దాన్ని పాక్ సైన్యం కూల్చేసింది. భారత్‌కు జరిగిన ఈ ఒక్క నష్టాన్ని ఆనాడు పాక్ ఆర్మీ పెద్దదిగా చేసి చూపించింది. ఆపరేషన్ సిందూర్ ఆదిలో ఉండగానే విజయాన్ని, ఆధిపత్యాన్ని క్లెయిమ్ చేసుకొని మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కేందుకు పాక్ పాకులాడింది” అని తెలిపింది.
“దీనివల్ల తదుపరి రోజుల్లో(మే 8, 9, 10 తేదీల్లో) భారత్ సాధించిన అంతకంటే విలువైన ఫలితాలు పెద్దగా కనిపించకుండా పోయాయి. భారత్ ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. తద్వారా పాక్ వైమానిక శక్తి సామర్థ్యాలను చాలావరకు తగ్గించింది. మొత్తం మీద ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌పై భారత్ పూర్తిస్థాయి పైచేయిని సాధించింది” అని సీహెచ్‌పీఎం సంస్థ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.
“ఆపరేషన్ సిందూర్ కోసం ప్రణాళిక రచించేందుకు త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చినందువల్లే పాక్ ప్రతిఘటనను ఎదుర్కొనే వ్యూహాలను భారత త్రివిధ దళాలు ముందస్తుగా సిద్ధం చేసి ఉంచగలిగాయి. అందుకే పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిసినా, భారత్ నిర్భయంగా దాడులు చేయగలిగింది” అని తెలిపారు.
“మే 7న తెల్లవారుజామున పాక్‌లోని బహవల్‌పూర్, మురిద్కేలలో ఉన్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలు, ప్రధాన కార్యాలయాలపై భారత్ అత్యంత కచ్చితత్వంతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది ఉగ్రవాదులు చనిపోయారు. భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ ఎటాక్స్ చేశాయి” అని సీహెచ్‌పీఎం నివేదిక తెలిపింది.
“మే 7న తెల్లవారుజామున దాదాపు 60 భారత యుద్ధ విమానాలు, 40 పాక్ యుద్ధ విమానాలు గగనతలంలో తలపడ్డాయి. చాలాపెద్ద గగనతల సైనిక ఘర్షణల్లో ఇదీ ఒకటి. ‘ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్’ (అవాక్) విమానం నుంచి అందిన సమాచారం ప్రకారం, భారత యుద్ధ విమానాలపైకి మేడిన్ చైనా పీఎల్-15 క్షిపణులను పాక్ యుద్ధ విమానాలు ప్రయోగించాయి” అని ఆ నివేదిక పేర్కొన్నద.
“చైనాలో తయారైన జే-10సీ యుద్ధ విమానాల నుంచే పీఎల్-15 క్షిపణులతో దాడి చేశారని వెల్లడైంది. దీంతో 1 రాఫెల్ యుద్ధ విమానం, 1 మిరేజ్ -2000 ఫైటర్ జెట్, మరొక యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. ఈ అంశాన్ని పాక్ బాగా ప్రచారం చేసుకుంది. తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంది” అని సీహెచ్‌పీఎం నివేదిక పేర్కొంది.
“సైనిక ఆపరేషన్లలో కేవలం తొలిరోజున జరిగిన ఘట్టాలు మొత్తం ఫలితాన్ని నిర్ణయించలేవు. మే 8, 9, 10 తేదీల్లో పాక్‌పై భారత్ చేసిన దాడి గురించి తెలిస్తే ఎవరి ఆలోచన అయినా మారిపోతుంది. స్కాల్ప్-ఈజీ, బ్రహ్మోస్ క్షిపణులతో పాక్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కవరేజీ వ్యవస్థలు, వైమానిక స్థావరాలను భారత్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది” అని ఆ నివేదిక వెల్లడించింది.
“భారత్ బలమైన వరుస దాడుల వల్లే పాక్ రక్షణ కవచం బలహీనపడింది. పాక్‌లోని ప్రధాన రన్‌వేలు, వాటితో ముడిపడిన సహాయక వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. దీంతో వెంటనే పాక్ వాయుసేన స్పందించే అవకాశం లేకుండాపోయింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ ఆర్కిటెక్చర్ (ఐఏసీసీసీఎస్), ఆర్మీకి చెందిన ఆకాశ్ తీర్ సిస్టమ్ కలిసి పనిచేయడంతో ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పైచేయి ఖాయమైంది” అని స్పష్టం చేసింది.
“ఆకాశ్, బరాక్-8, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా పాక్ మిస్సైల్, డ్రోన్ దాడులను భారత్ బలంగా తిప్పికొట్టింది. అందుకే మే 10కల్లా లెక్క పూర్తిగా మారిపోయింది. కాల్పుల విరమణ కావాలంటూ భారత్‌తో చర్చలకు పాక్ వచ్చింది” అని సీహెచ్‌పీఎం నివేదిక విశ్లేషించింది.

More Stories
బంగ్లాదేశ్ ఎన్నికల్లో 80 మంది హిందూ అభ్యర్థుల పోటీ
ఉత్తరాఖండ్ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం
గణతంత్ర వేడుకల సమయంలో జవాన్లపై మావోయిస్టుల దాడి