కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్నీ మార్చి తొలి వారంలో మార్క్ భారత్ లో పర్యటిస్తారని కెనడాలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ వెల్లడించారు. మార్క్ పర్యటన సందర్భంగా భారత్ తో ఎనర్జీ, అణు సహకారం, మినరల్స్, టెక్నాలజీ వంటి వివిధ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
కెనడాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న అమెరికాకు ధీటుగా భారత్ తో వ్యాపార, వాణిజ్య ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. యురేనియం సరఫరా, చమురు, అరుదైన ఖనిజాల సరఫరా, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, విద్య సహా పలు అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది. పదేళ్లపాటు యురేనియం సరఫరాకు సంబంధించి 2.8 కెనడియన్ బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రధానంగా నిలవనుంది.
ఈ వారంలో కెనడా ఎనర్జీ మినిస్టర్ టిమ్ హాడ్గా భారత్ లో పర్యటించి ఎనర్జీ, మినరల్స్, అణు సహకారం, చమురు, యురేనియం సరఫరా వంటి అంశాలపై చర్చిస్తారు. కెనడా ప్రధాని తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. కొన్నేళ్లుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతంలో ఇరు దేశాలు తమ రాయబారుల్ని కూడా వెనక్కు పిలిపించుకున్నాయి.
గతంలో కెనడా ప్రధానిగా చేసిన జస్టిన్ ట్రూడో వైఖరి వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇరుదేశాల మధ్య సంబంధాల్ని పునరుద్ధరించేందుకు క్యార్నీ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా భారత భద్రతా సలహాదారు వచ్చే నెలలో కెనడాలో పర్యటించబోతున్నారు.
అనేక అంశాలకు సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, అమెరికా.. అటు కెనడాపై, ఇటు భారత్ పై టారిఫ్‌లు భారీగా విధిస్తున్న సమయంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనుండటం వ్యూహాత్మక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

More Stories
జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’
హెచ్-1బీ ఇంటర్వ్యూలు 2027కి వాయిదా వేసినట్టు మెయిల్స్
భారత్ విజయం ప్రపంచాన్ని స్థిరంగా మారుస్తుంది