గణతంత్ర వేడుకల సమయంలో జవాన్లపై మావోయిస్టుల దాడి

గణతంత్ర వేడుకల సమయంలో జవాన్లపై మావోయిస్టుల దాడి

* మందుపాతర పేలి 11 మంది జవాన్లకు గాయాలు

గణతంత్ర వేడుకల సంబరాల్లో దేశమంతా తరిస్తున్న వేళ జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రక్తపాతానికి ఒడిగట్టారు. దేశ రాజధానిలో పరాక్రమ ప్రదర్శనలు జరుగుతున్న తరుణంలోనే, బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా నక్సలైట్లు ఐఈడీ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ పిరికిపంద దాడిలో 11 మంది ధీర జవాన్లు తీవ్రంగా గాయపడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కర్రెగుట్ట కొండల ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత స్థావరం. అయితే, గత నవంబర్ నుండి అక్కడ భద్రతా బలగాలు తమ పట్టును బిగించాయి. దీనిని సహించలేని మావోయిస్టులు రిపబ్లిక్ డే సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాత్మకంగా పాతర బాంబులను అమర్చారు. 
 
ఆదివారం ఉదయం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఈ ఐఈడీలు ఒక్కసారిగా పేలాయి. ఈ పేలుళ్ల తీవ్రతకు అటవీ ప్రాంతం దద్దరిల్లిపోగా, కూంబింగ్‌లో ఉన్న జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 11 మందిలో 10 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి) దళానికి చెందిన వారు కాగా, ఒకరు సీఆర్‌పీఎఫ్ కి చెందిన ఎలైట్ యూనిట్ ‘కోబ్రా’ సబ్-ఇన్‌స్పెక్టర్ రుద్రేష్ సింగ్‌గా గుర్తించారు. 
 
పేలుడు ధాటికి ముగ్గురు జవాన్ల కళ్లలోకి ఇనుప ముక్కలు (స్ప్లింటర్స్) దూసుకుపోగా, మరికొందరి కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ వెంటనే హెలికాప్టర్ల ద్వారా రాయ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఇదే కరేగుట్ట అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాలు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ నిర్వహించాయి.
21 రోజుల పాటు సాగిన ఆ దాడుల్లో 31 మంది అగ్రశ్రేణి నక్సలైట్లు హతమయ్యారు. అప్పట్లోనే 450కి పైగా ఐఈడీలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఆ దెబ్బతో నలిగిపోయిన మావోయిస్టులు, తమ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు రిపబ్లిక్ డే వేళ జవాన్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డారు.  మావోయిస్టుల అడ్డాగా ఉన్న తడపల గ్రామంలో పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయడమే ఈ కుట్రకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ దాడిపై జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం శాఖ ఈ ఘటనపై ఆరా తీసింది. గాయపడిన జవాన్లకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ అధికారులను ఆదేశించారు. నక్సల్స్ భీరుత్వానికి తాము తలవంచబోమని, ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ మరింత ఉద్ధృతం చేస్తామని భద్రతా దళాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం బీజాపూర్ పరిసర అడవులను అదనపు బలగాలు చుట్టుముట్టాయి.