రిపబ్లిక్ పరేడ్ లో ఫేజ్‌డ్ బ్యాటిల్ అరే, హైపర్‌సోనిక్ మిసైళ్లు, డ్రోన్ శక్తి

రిపబ్లిక్ పరేడ్ లో ఫేజ్‌డ్ బ్యాటిల్ అరే, హైపర్‌సోనిక్ మిసైళ్లు, డ్రోన్ శక్తి

దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు   అట్టహాసంగా కొనసాగుతున్నాయి.”వందేమాతరానికి 150 ఏళ్లు” ప్రధాన ఇతివృత్తంతో వేడుకలు నిర్వహిస్తున్నారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భద్రతాబలగాల గౌరవవందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం 6050 మంది సైనికులతో పరేడ్ నిర్వహించారు. ఇందులో 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారతీయ వ్యోమగామి శుభాన్ష్ శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక చక్ర ప్రదానం చేశారు.

గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. భారత సైనిక శక్తి చాటేలా, రక్షణలో ఆత్మనిర్భరతకు ప్రతీకగా ఈసారి జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతు నిలిచింది.

ఇప్పటి వరకు చూసిన రిపబ్లిక్ డే పరేడ్‌లకు భిన్నంగా, 77వ గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేకతను సంతరించుకొన్నది.  తొలిసారి భారత సైన్యం ప్రవేశపెట్టిన ఫేజ్‌డ్ బ్యాటిల్ అరే ఫార్మాట్, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ టేబ్లో ఆపరేషన్ సిందూర్, మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చిన హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ నమూనాలు, ఆటోనమస్ రోబోటిక్ సిస్టమ్స్, స్వార్మ్ డ్రోన్లు ఇలా ఒకటేమిటి ఈ ఏడాది పరేడ్​లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

దేశ రక్షణలో భారత్ ఎంత వేగంగా ఆధునికీకరణ దిశగా ముందుకెళ్తుందో, ఆత్మనిర్భర్ భారత్ కల ఎలా నిజమవుతోందో పరేడ్ ఘనంగా చాటిచెప్పింది. సైనిక శక్తి, త్రివిధ దళాల ఐక్యత, సాంస్కృతిక వైభవం ఒకే వేదికపై కలిసిన ఈ వేడుక దేశ ప్రజల్లో నూతనోత్తాజాన్ని నింపింది. డిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా జరిగిన ఈ పరేడ్​ను కోట్లాది మంది టీవీ, డిజిటల్ వేదికల ద్వారా వీక్షించారు. 

పరేడ్‌కు లెఫ్టినెంట్ జనరల్ భవ్నిష్ కుమార్ నాయకత్వం వహించగా, మేజర్ జనరల్ నవ్రాజ్ ధిల్లన్ రెండో కమాండర్‌గా వ్యవహరించారు. సైనిక బాండ్ల గర్జన, జాతీయ గీతాల నాదం మధ్య ప్రారంభమైన కవాతు దేశభక్తి భావాన్ని ఉప్పొంగించింది. ఈ ఏడాది పరేడ్‌లో అత్యంత కీలక ఆకర్షణగా నిలిచింది ఫేజ్‌డ్ బ్యాటిల్ అరే ఫార్మాట్. ఇప్పటివరకు ఎప్పుడూ రిపబ్లిక్ డే వేదికపై చూడని విధంగా యుద్ధ భూమిలో జరిగే ప్రతి దశను వరుసగా చూపించే విధానాన్ని భారత సైన్యం తొలిసారి ప్రవేశపెట్టింది.

గూఢచర్యం, శత్రు కదలికల గమనించడం, రికానిసెన్స్ నుంచి మొదలై, ప్రధాన దాడి, రక్షణ చర్యలు, మద్దతు వ్యవస్థల వరకూ యుద్ధ క్రమాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.  ఆధునిక యుద్ధానికి భారత సైన్యం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్న సందేశం ఈ ఫార్మాట్ ద్వారా దేశానికి స్పష్టంగా వెళ్లింది. ఫేజ్‌డ్ బ్యాటిల్ అరేలో భాగంగా భైరవ్ లైట్ కమాండో బటాలియన్ తొలిసారి పరేడ్‌లో పాల్గొంది.

వీరితో పాటు స్పెషల్ ఫోర్సెస్ వాహనాలు, రోబోటిక్ డాగ్స్, అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ ప్రజలను ఆశ్చర్యపరిచాయి. నిగ్రహ, భైరవ్, భువిరక్ష, కృష్ణ వంటి ఆటోనమస్ సిస్టమ్స్ తొలిసారి ప్రజల ముందుకు రావడం ప్రత్యేకంగా నిలిచింది.  యుద్ధ రంగంలో మానవ జోక్యం తగ్గించి, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందన్న సంకేతాన్ని ఇవి స్పష్టంగా చూపించాయి.

స్వార్మ్ డ్రోన్లు, టెథర్డ్ డ్రోన్లు, హైబ్రిడ్ యూఏవీలు, లోయిటరింగ్ మునిషన్స్ డ్రోన్ శక్తిని ఈ స్థాయిలో ఒకేసారి ప్రజల ముందు ప్రదర్శించడం ఇదే తొలిసారి. హరోప్, మినీ హార్పీ, స్కై స్ట్రైకర్, పీస్‌కీపర్ వంటి లోయిటరింగ్ ఆయుధాలు యుద్ధ రంగంలో గేమ్ ఛేంజర్‌గా మారుతున్నాయన్న విషయాన్ని ఈ ప్రదర్శన తెలియజేసింది. డీఆర్‌డీఓ ప్రదర్శన ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మాక్ 10 వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్, లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ నమూనాలు తొలిసారి ప్రజల ముందుకు వచ్చాయి. భారత్ హైపర్‌సోనిక్ టెక్నాలజీలోకి అడుగుపెట్టిందన్న సంకేతాన్ని ఈ ప్రదర్శన స్పష్టంగా ఇచ్చింది.

హిమ్ యోధాస్ అనిమల్ కాంటింజెంట్ ఈసారి కొత్త రూపంలో దర్శనమిచ్చింది. బాక్ట్రియన్ ఒంటెలు, జాన్స్కర్ పోనీలు, రాప్టర్స్, దేశీ శునకాలకు బుల్లెట్‌ప్రూఫ్ గేర్, కెమెరాలు, జీపీఎస్ అమర్చిన విధానం తొలిసారి ప్రదర్శించారు. సరిహద్దు ప్రాంతాల్లో జంతువులు కూడా హైటెక్ సైనికులుగా మారుతున్నాయన్న విషయం ఈ దృశ్యం తెలియజేసింది.