రిపబ్లిక్‌ డే వేళ 10,000 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రిపబ్లిక్‌ డే వేళ 10,000 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
 

గణతంత్ర దినోత్సం వేళ రాజస్థాన్‌లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగౌర్‌ జిల్లాలోని హర్సౌర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి దాదాపు పదివేల కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటితోపాటు డిటోనేటర్లు ఫ్యూజ్​ వైర్లను కూడా సీజ్​ చేశారు. 187 బస్తాల్లో 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను గుర్తించి సీజ్‌ చేశారు.

దీంతో పాటు 9 కార్టన్ల డిటోనేటర్లు, 12 కార్టన్లు, 15 ప్యాకెట్ల నీలిరంగు ఫ్యూజ్ వైర్, ఐదు ప్యాకెట్ల ఎరుపు రంగు ఫ్యూజ్ వైర్‌లు సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో సులేమాన్‌ ఖాన్‌ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గతకొన్ని రోజులుగా జిల్లాలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడం, అమ్మడం, నిల్వ చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని నాగౌర్ ఎస్​పీ మృదల్ కచావా తెలిపారు.
`మొత్తం 10,000 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నాం. పెద్ద మొత్తంలో డిటోనేటర్లు, డిటోనేటింగ్ వైర్, మైనింగ్ సంబంధిత బ్లాస్టింగ్‌కు ఉపయోగించే ఇతర పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని ఎస్​పీ మృదల్ కచావా తెలిపారు. నిందితుడు సులేమాన్ ​ఖాన్​పై గతంలో మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్​పీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సం ముందు భారీగా పేలుడు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.

రాజస్థాన్​లో నూతన సంవత్సరం వేళ కూడా పెద్దఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.  ఓ కారులో 150కిలోల అమ్మోనియం నైట్రేట్‌, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో యూరియా సంచుల్లో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ నింపి ఉంచినట్లు గుర్తించారు. అదేవిధంగా 200 కాట్రిడ్జ్‌లు, ఆరు కట్టల (1,100 మీటర్లు) సేఫ్టీ ఫ్యూజ్‌ వైర్‌ స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిల్లీలో ఎర్రకోట పేలుడు ఘటనలో కూడా అమ్మోనియం నైట్రేట్​ను ఉపయోగించారు. ఆ పేలుడులో రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్​తో పాటు పెట్రోలియం, ఇతర పదార్థాలు వాడినట్లు తెలిసింది.

ఆ ఘటన తర్వాత జమ్ముకశ్మీర్, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్, ఢిల్లీలలో  కేంద్ర ఏజెన్సీలు చేపట్టిన ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌ లాంటి పేలుడు పదార్థాలను సుమారు 2,900 కిలోల దాకా స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజస్థాన్​లో దొరికిన పెలుడు పదార్థాలు కూడా అమ్మోనియం నైట్రేట్​ కావడంతో ఆందోళన కలిగిస్తోంది. పేలుడు పదార్థాలతో భారీ సంఖ్యలో డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లను కూడా ఉన్నాయి.