సీనియర్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ (90) కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1935 అక్టోబర్‌ 24న కోల్‌కతాలో ఓ బ్రిటీష్‌ కుటుంబంలో జన్మించిన మార్క్‌ పాత్రికేయ రంగానికి అసమాన సేవలు అందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీలో న్యూఢిల్లీ బ్యూరో చీఫ్‌గా రెండు దశాబ్దాలకుపైగా సేవలందించారు. రచయితగానూ సత్తా చాటారు. 

అక్టోబర్ 24, 1935న  బంగాల్‌లోని టాలిగంజ్‌లో సంపన్న బ్రిటిష్ కుటుంబంలో మార్క్ టూలీ జన్మించారు. పాతికేళ్ల వయసులో అంటే 1960లో బీబీసీలో చేరి ఢిల్లీ బ్యూరోగా 22 ఏళ్లపాటు పని చేశారు. ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ కు వెళ్లారు. అయితే, అక్కడి జీవితం తనకు ఎంతో నిరాశ కలిగించిందని, భారత్‌లోని ప్రకాశవంతమైన వాతావరణం మిస్ అయ్యానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వేదాంత కోర్సు చదివిన టూలీ, మొదట పూజారిగా మారాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలు వల్ల వదిలేశారు. ఆ తర్వాత జర్నలిజం వైపు ఆయన అడుగులు వేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన్ను జర్నలిజం రంగంలో ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. “జర్నలిజం రంగంలో ఒక గొప్ప వ్యక్తి అయిన సర్ మార్క్ టల్లీ మరణం పట్ల నేను తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. భారతదేశంతో మరియు మన దేశ ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఆయన రచనలలో ప్రతిబింబించింది. ఆయన రిపోర్టింగ్ మరియు విశ్లేషణలు ప్రజా చర్చలపై చెరగని ముద్ర వేశాయి. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనేక మంది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి” అని ప్రధాని తెలిపారు.

దక్షిణాసియాకు సంబంధించిన అనేక అంశాలతోపాటు చారిత్రక, రాజకీయ నేపథ్యం ఉన్న వార్తల్లో తనదైన ముద్రవేశారు. దేశాన్ని కుదిపేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ (1984)పై ఆయన విశ్లేషణాత్మక కథనాలు అందించారు. బీబీసీ రేడియోలోనూ సేవలందించారు. ‘సంథింగ్ అండర్‌స్టుడ్‌’ కార్యక్రమాన్ని నిర్వమించారు. ఫారిన్ కరస్పాండెంట్‌గా జాతీయ, అంతర్జాతీయ అంశాలను బీబీసీ ద్వారా ప్రజలకు అందించారు.  

బ్రిటీష్‌ కాలం నుంచి స్వతంత్ర్య భారతావనిలో పాలన తీరు తెన్నులపై అనేక డాక్యుమెంటరీలు కూడా ఆయన రూపొందించారు. బీబీసీ సంస్థకు ఇండియా తరఫున బ్యూరో చీఫ్‌గా అత్యధిక కాలం సేవలందించి ఆయనే. మరోవైపు రచయితగానూ సత్తా చాటారు. నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా, ఇండియా ఇన్ స్లో మోషన్, ద హార్ట్ ఆఫ్ ఇండియా వంటి పుస్తకాలు రచించారు. 

రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలకు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు 1992లో పద్మశ్రీ పురస్కారం దక్కగా, 2005లో పద్మభూషణ్ పురస్కారం దక్కింది. 2002లో నైట్‌హుడ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. టుల్లీ మృతికి పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు.