ప్రభుత్వంకు ప్రతి బొగ్గు గని కార్మికుడి ప్రాణం విలువైనదే అని, అందుకే జీరో యాక్సిడెంట్ మైన్ పాలసీతో ముందుకెళ్లాలని కోల్ కంపెనీలకు సూచిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగూడెం పరిధిలోని 74 ఏళ్ల నాటి పివికె-5 అండర్‌గ్రౌండ్ మైన్ ఆవరణలో బొగ్గుగని కార్మికులతో ఆదివారం జరిపిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ కార్మికులకు ఏమైనా జరిగితే వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే బాధ్యత కంపెనీలది అని స్పష్టం చేశారు.
అందుకే దేశవ్యాప్తంగా 4 లక్షల మంది బొగ్గు గని కార్మికులకు కోటి రూపాయల భీమా పధకం తీసుకొచ్చామని, ఇవాళ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో, కార్పొరేట్ సంస్థల్లో అమలుచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు భూగర్భంలో పనిచేస్తున్నారని చెబుతూ వారందరికీ అభినందనలు తెలిపారు.
136 చరిత్ర గల సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఒక ప్రత్యేకమైన సంస్థ అని, లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని చెప్పారు.
మనమంతా మరింత అంకితభావంతో పనిచేద్దమని, సింగరేణిని ముందుకు తీసుకెళ్దామని సూచించారు. సింగరేణి ద్వారా 25 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది పొందుతున్నాయని పేర్కొంటూ మన ఉద్యోగం.. , మన కుటుంబం కోసమే కాకుండా దేశ సేవగా భావించాలని ఆయన కోరారు.
“మీ శ్రమ ద్వారా ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లోని అనేక ఇళ్లలో వెలుగులు అందుతున్నాయి. దేశంలో 74% విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోంది. ఇందులో మీ శ్రమ కారణంగానే వివిధ రంగాల్లో కోట్లాది మందికి ఉపాధి లభిస్తుంది. గతంలో బొగ్గు వెలికితీత చాలా ప్రమాదకరంగా ఉండేది. అప్పుడు కూడా మీరు ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశారు. ఇవాళ సాంకేతికత పెరిగింది, భద్రతా ప్రమాణాలు పెరిగాయి” అని కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణిలోని 40, 50వేల మంది కార్మికులు, తమ కుటుంబాలు, అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారెందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే, మన సింగరేణి పరిస్థితి ఊహించినత గొప్పగా లేదని, అందుకే ఈ సంస్థను మనం రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలని ఆయన పిలుపిచ్చారు. సంస్థ బాగుంటేనే మనమంతా బాగుంటామని స్పష్టం చేశారు.
“తెలంగాణ బిడ్డగా, కేంద్ర మంత్రిగా నేను సింగరేణికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. కార్మికులు ఐకమత్యంతో పనిచేయాలి. సంస్థను కాపాడుకోవాలి. మిగిలిన బొగ్గు ఉత్పత్తి సంస్థలతో పోలిస్తే
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ధర ఎక్కువగా ఉందని విచారం వ్యక్తం చేశారు. అందుకే ఖర్చులను తగ్గించుకుని ముందుకెళ్లాలని సూచించారు.
ఖర్చు తగ్గించుకోవడంతోపాటు ఉత్పత్తిని పెంచాలని, అందులోనూ నాణ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి జరగాలని ఆయన కోరారు. మార్కెట్లో పోటీతత్వం పెరిగిందని చెబుతూ ఇతర దేశాలనుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి బయటకు రావాలని కోరారు. మన దేశం నుంచి బొగ్గు ఎగుమతి జరగాలనేది ప్రధానమంత్రి మోదీ ఆలోచన అని పేర్కొంటూ మన బొగ్గు నాణ్యత పెరిగితేనే ఇతరదేశాల నుంచి దిగుమతి తగ్గుతుందని తెలిపారు.
కోల్ గ్యాసిఫికేషన్ ను కేంద్రప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని చెబుతూ ఏ కార్మిక సంఘమైనా సంస్థ విషయంలో ఐకమత్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. కార్మిక సంఘాల ఎన్నికలు జరిగితే.. పోటీ ఉండాలని, కానీ సంస్థ భవిష్యత్తు కోసం మాత్రం కలిసి పనిచేయాలని హితవు చెప్పారు. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతూ అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఇది కార్మికుల సంస్థ అని, లాభాల్లో మొదటి వాటా కార్మికులకే అందాలనేది మోదీ గారి ఆలోచన అని స్పష్టం చేసారు.
More Stories
అధికార కేంద్రీకరణకు వ్యతిరేకంగా, సుపరిపాలన కోసమే జెన్ -జెడ్
ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల కాల్పుల్లో 51 ఏళ్ల వ్యక్తి మృతి
అమెరికాలో మంచు తుపాను బీభత్సం .. 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ