* తోలుబొమ్మ యువరాజుకు పట్టాభిషేకమన్న లాలూ కూతురు
బిహార్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఆమోదం తెలిపింది. బిహార్ రాజధాని పాట్నాలోని ఒక హోటల్‌లో ఆదివారం ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, తేజస్వి యాదవ్, మిసా భారతి సహా కీలక నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి తీవ్ర ఎదురుదెబ్బ తగలింది. మహాగఠ్‌బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పోటీ చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు.
ఆ పరాజయానంతరం పార్టీ భవిష్యత్ దిశపై చర్చలు సాగుతుండగా, జాతీయ కార్యవర్గ సమావేశంలో తేజస్వీకి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని, అలాగే యువతకు అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు పార్టీ అధినేత లాలూ కొన్నేళ్లుగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పార్టీ నిర్వహణ కష్టమైపోతోంది. అందుకే కొత్త నాయకుడిగా తేజస్వి యాదవ్‌ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీకి సంబంధించి మరికొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, నిర్మాణాత్మక మార్పులు, నిర్వహణ లోపాలు సరిదిద్దడం, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చే తరాల్ని ఆకట్టుకునేలా పార్టీని సమూలంగా మార్చాలని తేజస్వి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తేజస్వీ నియామకం వేళ ఆర్జేడీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య పార్టీ నియంత్రణ ద్రోహులు, కుట్రదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ప్రత్యర్థులు పంపిన వ్యక్తులే ఇప్పుడు పార్టీని నాశనం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆమె ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. పార్టీ పరిస్థితిపై బాధ్యత వహించాల్సిన నేతలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం పాటిస్తున్నారని రోహిణి విమర్శించారు.

More Stories
బడ్జెట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు
స్టాలిన్- విజయ్ మధ్య తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!
జనగణనకు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం