దేశంలో తొలిసారిగా సంచార పశు పోషకుల గుర్తింపు 

దేశంలో తొలిసారిగా సంచార పశు పోషకుల గుర్తింపు 
 
దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం సంచార పశు పోషకులను గుర్తించింది. 21వ పశుగణనను ప్రభుత్వం 2024లో నోటిఫై చేసింది. అదే సంవత్సరం డిసెంబరులో ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ గత సంవత్సరం జూన్‌ వరకూ కొనసాగింది. ఇప్పుడది పూర్తయింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా సంచార జాతులను ఈ గణనలో గుర్తించడం విశేషం. 
 
రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలకు చెందిన పశుపోషకులను మాల్దారీలు, గుమంతు పశుపాలకులు, గదారియాలు అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వీరంతా రైకా, ధన్‌గర్‌, కురుబా వంటి జాతులకు చెందిన వారు. దేశంలో 1919లో అప్పటి బ్రిటన్‌ ప్రభుత్వం తొలిసారిగా పశుగణన జరిపింది. దేశంలో సంచార పశుపోషకుల సంఖ్య గణనీయంగా ఉంది.
ప్రతి సంవత్సరం వేలాది మంది సంచార పశుపోషకులు కుటుంబాలను వదిలి పశువులను వెంట తీసుకొని కాలినడకన సుదూర ప్రాంతాలకు వెళుతుంటారు. ముఖ్యంగా వారు పశుగ్రాసం పుష్కలంగా లభ్యమయ్యే ప్రదేశాలను ఎంచుకుంటారు.  సుమారు రెండు కోట్ల మంది సంచార పశుపోషకులు ఈ విధంగా అడవులు, పచ్చిక బయళ్ల బాట పడతారని అంచనా. అయితే వారి సంఖ్యపై నేటి వరకూ అధికారిక గణాంకాలేవీ అందుబాటులో లేవు. 
పశుగ్రాసాన్ని వెతుక్కుంటూ సీజన్ల వారీగా సుదూర ప్రాంతాలకు వలస పోయే వారిని పాలకులు గుర్తించడం లేదు.  వీరు దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూత అందిస్తున్నప్పటికీ వారి వివరాలేవీ అధికారికంగా అందుబాటులో లేకపోవడం విచారకరం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణన జరుగుతుంది. 20వ పశుగణన 2019లో జరిగింది. అయితే ఈ ప్రక్రియలో ఏనాడూ సంచార పశుపోషకులను పరిగణనలోకి తీసుకోలేదు. 
 
తాజాగా చేపట్టిన 21వ సర్వేలో ఆ వివరాలను చేర్చారు. సంవత్సరంలో కనీసం నెల రోజుల పాటు పశువులను బయటికి తీసుకుపోయిన వారిని సంచార పశుపోషకులుగా గుర్తించారు. పశుగణన కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని సంప్రదాయ జాతులను గుర్తించారు.