అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురుస్తుంది. పదిహేను కోట్ల మందికి పైగా ప్రజలు గడ్డ కట్టే చలిలో వణికిపోతున్నారు దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెక్సాస్, ఓక్లహోమాపై మంచు తుపాను విరుచుకుపడుతుంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకూ దాదాపు 2,000 మైళ్ల పరిధిలో ఈ తుపాను ప్రభావం చూపుతుండటంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.
సుమారు 20 కోట్ల మందిపై ఈ వాతావరణ ప్రభావం పడగా, వాషింగ్టన్ డీసీతో పాటు 16కు పైగా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మంచు తుపాను కారణంగా 8 వేలకు పైగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. శనివారం నాటికి 3,200 విమానాలు, ఆదివారం 4,800 విమాన సర్వీసులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో రవాణా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అంచనా వేశారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.
అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వైట్ వాష్ కనిపిస్తోంది. జనవరి 23, శుక్రవారం నుంచి మొదలైన ఈ ‘వింటర్ స్టార్మ్ ఫెర్న్’ తుఫాన్ ప్రభావం సోమవారం (జనవరి 26) వరకు తీవ్రంగా ఉండబోతోంది. సౌత్, మిడ్-వెస్ట్, నార్త్-ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 23 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాను గుప్పిట్లో చిక్కుకున్నారు. మంచుతో రోడ్లు, చెట్లు, విద్యుత్ లైన్లను ప్రమాదకరంగా మారుస్తుంది. దీనివల్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లు మూసుకుపోతాయి.
ఈశాన్యంలోని కొన్ని ప్రదేశాలలో ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోవచ్చు. దీంతో ప్రయాణాలు చాలా కష్టమవుతుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చిన తీవ్ర శీతల గాలులు, శక్తివంతమైన తుపాను వ్యవస్థతో కలవడంతో భారీ హిమపాతం, గడ్డకట్టే వర్షం, స్లీట్ నమోదవుతున్నాయి. సదరన్ ప్లెయిన్స్, టెన్నెస్సీ వ్యాలీ, ఆగ్నేయ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విపత్తు స్థాయిలో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చికాగో, ఇతర మిడ్‌వెస్ట్రన్ నగరాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విమానయాన సంస్థలు వేలాదిగా విమానాలను రద్దు చేశారు. చర్చిలు, సన్ డే ఈవెంట్స్ ను, కార్నివాల్ ను రద్దు చేశారు. టెక్సాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది. తుపాను ముగిసిన తర్వాత మంచు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చెట్లు, విద్యుత్ లైన్లు పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
తుపాను తీవ్రత పెరుగుతుండడంతో.. కొన్ని రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని, ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. చికెన్, గుడ్లు, పిజ్జాలను తీసుకుంటున్నారు. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో మంచుతో రోడ్లు నిండిపోయాయి. మంచు తుపాను ఈశాన్య దిశగా కదులుతుంది. వాషింగ్టన్ నుండి న్యూయార్క్, బోస్టన్ మీదుగా కదులుతుందని జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది.
మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మిస్సోరి, ఇల్లినోయీలలోనూ భారీ మంచు కురుస్తుంది. ప్రతికూల వాతావరణంతో వాహనాలు మంచులో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దశాబ్దిలోనే అతి తీవ్రమైన మంచు తుపానుగా చెబుతున్నారు.

More Stories
ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల కాల్పుల్లో 51 ఏళ్ల వ్యక్తి మృతి
శాంతి చర్చలు జరుగుతుండగానే ఉక్రెయిన్ పై రష్యా దాడులు
ఆఫ్ఘన్ లో మంచు తుఫాన్, వర్షాలు.. 61 మంది మృతి