శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా షూటింగ్ జరిగిందనే వార్త ప్రస్తుతం కేరళలో సంచలనం సృష్టిస్తోంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. మలయాళ చిత్ర దర్శకుడు అనురాజ్ మనోహర్ మకరవిళక్కు పండుగ రోజున అత్యంత పవిత్రమైన, నిషేధిత ప్రాంతమైన అయ్యప్ప సన్నిధానంలో వీడియో చిత్రీకరణ చేశారని ఫిర్యాదు అందింది.
షూటింగ్ కోసం దర్శకుడు ముందే అనుమతి కోరారని, అయితే బోర్డు దాన్ని నిరాకరించిందని టీడీబీ ప్రతినిధి తెలిపారు. శబరిమల యాత్ర సమయంలో కేవలం గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే పరిమితంగా అనుమతి ఉంటుందని, సినిమా చిత్రీకరణలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. టీడీబీ విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సునీల్ కుమార్ ఈ ఫిర్యాదును ధృవీకరించారు. దర్శకుడు ఎక్కడ చిత్రీకరణ చేశారు? ఈ ఘటనలో నిబంధనలు ఉల్లంఘించారా? లేదా? అనే కోణంలో విచారణ జరుపుతామని వెల్లడించారు.
అయితే, అయ్యప్ప ఆలయ పరిసరాల్లో సినిమా షూటింగ్ చేశారన్న ఆరోపణలపై దర్శకుడు అనురాజ్ మనోహర్ తోసిపుచ్చారు. తాను అయ్యప్ప సన్నిధానంలో ఎలాంటి చిత్రీకరణ చేయలేదని, కేవలం పంబ నది వద్ద మాత్రమే వీడియో తీసినట్లు చెప్పుకొచ్చారు. సన్నిధానం వద్ద సినిమా షూటింగ్ కోసం అనుమతి అడిగిన మాట నిజమేనని, కానీ ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు నిరాకరించడంతో అక్కడ షూటింగ్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.
శబరిమల అయ్యప్ప ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకున ముందస్తు అనుమతి లేకుండా సన్నిధానం పరిసరాల్లో ఎలాంటి వీడియో చిత్రీకరణలు లేదా సినిమా షూటింగ్లు చేయడం చట్టరీత్యా నేరం. భద్రతా కారణాల దృష్ట్యా కూడా సన్నిధానం పరిసరాల్లో కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. పవిత్రమైన శబరిమల సన్నిధానంలో సినిమా షూటింగ్ చేశారన్న వార్తలు రావడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
దేశంలో తొలిసారిగా సంచార పశు పోషకుల గుర్తింపు
రాత్రికి రాత్రి ఇనుప వంతెన దొంగతనం
జమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాది హతం