ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌

ప్రపంచకప్‌లో  బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌
పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ఆడుతుందా? ఆడదా? అనే అనిశ్చితికి తెరపడింది. భారత్‌లో ఆడబోమని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉద్వాసన పలికింది. బంగ్లాను ప్రపంచకప్‌ జట్ల జాబితా నుంచి తొలగించింది. ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని శనివారం ఎక్స్ వేదికగా ఐసీసీ ప్రకటించింది.

భారత్‌లో పొట్టి ప్రపంచకప్‌ ఆడబోమని బెట్టు చేసిన బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు భారీ మూల్యం చెల్లించుకుంది. నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ కోరినా వెనక్కి తగ్గని ఆ బోర్డుకు చెంప చెళ్లుమనిపించేలా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఆడకుంటే మరో జట్టుకు చోటిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పిన ఐసీసీ శనివారం స్కాట్లాండ్‌కు చోటు కల్పించింది. గ్రూప్ సీ బంగ్లాదేశ్ బదులు ఈ యూరోపియన్ జట్టు భారత్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడనుంది.

ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో ప్రపంచకప్ ఆడబోమని పంతం పట్టింది. భద్రతా కారణాల రీత్యా భారత్ లో కాకుండా శ్రీలంకలో ఆడుతామని, అందుకు వీలుగా గ్రూప్ స్వాపింగ్ చేయాలని ఐసీసీకి లేఖ రాసింది. కానీ, షెడ్యూల్ ప్రకటించినందున ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం కుదరని, బంగ్లాదేశ్ బృందం భద్రతకు తాము భరోసానిస్తామని బంగ్లా బోర్డుకు ఐసీసీ తెలిపింది. 

అంతేకాదు ఢాకాకు ఇద్దరు ప్రతినిధులను కూడా పంపింది. కానీ, బంగ్లా బోర్డు సభ్యులు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో షెడ్యూల్ మార్చడం కుదరని చెప్పిన ఐసీసీ భారత్‌లో ఆడాలనుకుంటే ఆడండి లేదంటే స్కాట్లాండ్‌కు అవకాశమిస్తామని హెచ్చరించింది. జనవరి 21లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బంగ్లా బోర్డును ఆదేశించింది. 

అయినప్పటికీ తాము భారత్‌లో ఆడబోమని ఆ దేశ బోర్డు పునరుద్ఘాటించింది. దాంతో మరో జట్టుకు అవకాశమివ్వాలని శుక్రవారం ఓటింగ్ ప్రారంభించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఐసీసీ వివాదాల పరిష్కారాల కమిటీకి తమ అభ్యర్థనను పంపాలని ఐసీసీకి మరో లేఖ రాసింది బంగ్లాదేశ్ బోర్డు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ డిమాండ్స్ ఐసీసీ నిబంధనలకు లోబడినవి కావని శనివారం ఐసీసీ సీఈవో సనోగ్ గుప్తా అధికారికంగా ఐసీసీకి బోర్డుకు లేఖ రాశారు.

ఐసీసీ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విభేదిస్తోందని, అందుకని బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టుకు అవకాశమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బోర్డులో ఒకడైన బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాంకు కూడా ఆ లేఖను సనోజ్ అందజేశారు. అంతేకాదు భారత్, శ్రీలంక సంయుక్తంగా తిథ్యమిస్తున్న ప్రపంచకప్‌లో ఆడాల్సిందిగా స్కాట్లాండ్ క్రికెట్‌కు ఆయన ఆహ్వానం పంపారు.