మధ్య ప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను, బలగాలను రక్షించేందుకు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా మోహరించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మరోవంక, అమెరికా పెంచుతున్న ఒత్తిళ్ళకు, బెదిరింపులకు ఇరాన్ కూడా దీటుగానే స్పందిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌లు తప్పుడు అంచనాలతో ముందుకు రావద్దంటూ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) హెచ్చరించింది.
దేశ అత్యున్నత నేత నుండి ఒకసారి ఆదేశాలు అంటూ రాగానే వెంటనే రంగంలోకి దిగడానికి గార్డ్స్ సిద్ధంగా వున్నారని తెలిపింది. అమెరికా దాడి ప్రారంభించిన మరుక్షణం అమెరికా ప్రయోజనాలు, స్థావరాలు, ఇన్ఫ్లూయన్స్ సెంటర్లు ఇలా అన్నీ కూడా ఇరాన్ మిలటరీ బలగాల లక్ష్యాలుగా మారతాయని ఉన్నత స్థాయి మిలటరీ అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని ట్రంప్ ప్రకటించారు.
కాగా, ఇరాన్లో ఇటీవల చోటు చేసుకున్న తీవ్రవాద సంఘటనల వెనుక 10 విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీసులు వున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జిఎస్) శుక్రవారం తెలిపింది. ఇరాన్ ప్రాదేశిక, జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించేందుకు అమెరికా-ఇజ్రాయిల్ అమలు చేసిన విఫల ప్రణాళికలో భాగమే ఈ సంఘటనలని పేర్కొంది.
జూన్‌లో 12 రోజుల పాటు ఘర్షణలు జరిగిన తర్వాత దేశంలో అంతర్గత గందరగోళం సృష్టించేందుకు, మిలటరీ జోక్యాన్ని రెచ్చగొట్టేందుకు, ముప్పు కలిగించే గ్రూపులను సమీకరించేందుకు ఒక విదేశీ కమాండ్ రూమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపింది. భద్రతా వ్యతిరేక నెట్‌వర్క్‌లతో సంబంధమున్న, 11 వేల మంది దుర్బలురుకు మార్గదర్శనం చేసిన 735 మందిని నిర్బంధించామని, 743 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.
ఇదిలావుండగా, అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే, తమపై ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయెల్ కలవరపడుతున్నది. అమెరికా నుంచి బహిరంగ ప్రకటన రాకపోయినప్పటికీ, అత్యంత అప్రమత్తతతో ఉంటున్నట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారులు చెప్పారు. వేర్వేరు సందర్భాలు ఎదురైనపుడు తిప్పికొట్టడానికి సైనిక, పోలీసు, అత్యవసర సేవలు, పౌర పాలనా యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను హై అలర్ట్‌లో ఉంచారు.
మరోవంక, అమెరికన్ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ సలహాదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై పరిమితంగా, భీకర దాడి చేయాలని కొందరు ఆయనకు సలహా ఇస్తుండగా, ఇరాన్ ప్రతిఘటన వేగంగా ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని మరికొందరు చెప్తున్నారు.

More Stories
హింసతో పాలిస్తున్న అప్రజాస్వామిక పాలనను ప్రతిఘటించాలి
కాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయం ఏకాత్మతా మానవతావాదం
తమిళనాట బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖాయం