కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ ఈ మధ్య ఆ పార్టీకి కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి, తన రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన కార్యక్రమానికి శశి థరూర్ హాజరవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు. 2009 నుంచి ఆయన అక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీలో ఇంత సీనియారిటీ ఉన్నప్పటికీ ఇటీవల తనకు తగిన గౌరవం దక్కడం లేదనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే పలు సందర్భాల్లో బీజేపీని, మోదీని పొగుడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తుంది. ఇక తాజాగా కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమాయత్తం కోసం శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక సమావేశం నిర్వహించింది.
పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఏర్పర్చిన ఈ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులతోపాటు, కేరళ నేతలను ఆహ్వానించారు. కానీ, కేరళకే చెందిన అగ్రనేతగా గుర్తింపున్న శశి థరూర్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. అంతేకాదు తన పార్లమెంట్ నియోజకవర్గమైన తిరువనంతపురంలో ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ, బీజేపీకి దగ్గరవుతున్నారా అనే సందేహం మొదలైంది.
ఎర్నాకుళంలో ఇటీవల నిర్వహించిన ‘మహాపంచాయత్’ కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వం, రాహుల్ గాంధీ తనను సరిగ్గా గౌరవించలేదనే ఆరోపణల నేపథ్యంలో థరూర్ సమావేశానికి హాజరుకాకపోవడం కలకలం రేపుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అధిష్టానం ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, థరూర్ స్పందించలేదని సమాచారం.
దానికి బదులుగా శనివారం కోజికోడ్‌లో జరిగే కేరళ సాహిత్య ఉత్సవానికి హాజరవుతానని ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే, శశి థరూర్ కాంగ్రెస్ సమావేశానికి రాలేనని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన సొంత నియోజకవర్గంలో మోదీ పాల్గొంటుండటంతో దీనికి హాజరయ్యేందుకు ఆయన కాంగ్రెస్ అనుమతి తీసుకున్నారని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక తనకు లేదని, పార్టీతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నానని థరూర్ నాయకత్వానికి తెలియచేయడంతో ఈ తాజా పరిణామాలు అనవసరమని థరూర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులు అభిప్రాయపడుతున్నారు. “ఇప్పుడు బంతి అధిష్టానం కోర్టులోనే ఉంది,” అని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.
“తిరువనంతపురంలో యువత, టెక్ నిపుణులు, మధ్యతరగతి వర్గాలలో థరూర్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీనిపై బీజేపీ కూడా కన్నేసింది. జిల్లాలోని 14 స్థానాలకు గాను యూడీఎఫ్‌కు కేవలం ఒకే ఎమ్మెల్యే ఉన్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది కాంగ్రెస్‌కు ఒక సవాలుగా ఉంటుంది,” అని ఆ నాయకుడు గుర్తు చేశారు.

More Stories
ఇరాన్ వైపు అమెరికా కీలక సైనిక మోహరింపులు
కాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయం ఏకాత్మతా మానవతావాదం
తమిళనాట బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖాయం