‘హలో ఎక్స్‌క్యూజ్‌మీ సైడ్ ప్లీజ్’! ‘మీరు ఎక్కాల్సిన రైలు ఇప్పటికే చేరుకుంది, జాగ్రత్తగా వెళ్లండి’! ‘హలో రైల్వే పోలీస్ స్టేషన్‌లోని 1వ నంబరు ప్లాట్‌ఫాంపై ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు అత్యవసరంగా రండి’ అంటూ విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘హ్యూమనాయిడ్ రోబో’ సందడి చేస్తోంది. స్టేషన్ భద్రత, ఇతర రక్షణపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది.
స్టేషన్‌లోని రైల్వే పోలీసులకు సహాయకారిగా పలు సేవలు అందిస్తుంది. విశాఖ రైల్వేస్టేషన్‌లో హ్యూమనాయిడ్ రోబో ఏఎస్‌సీ అర్జున్‌ను తూర్పుకోస్తా రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయాణికుల భద్రత, సేవల బట్వాడా కోసం అధునాతన సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ముందడుగు వేసింది. డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-ఆర్పీఎఫ్ ఏఎస్‌సీ అర్జున్‌ను విశాఖ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకి తెచ్చింది.
భారతీయ రైల్వేలో ఈ తరహా రోబోలను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఆర్పీఎఫ్ ఆధునీకరణ, డిజిటలీకరణలో భాగంగా ఈ హ్యూమనాయిడ్ రోబో వివిధ రైల్వే కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తుంది. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద వ్యక్తులు, నేరస్థుల సంచారాన్ని పసిగట్టి పోలీసులకు సమాచారాన్ని ఫోటోతో సహా అందజేస్తుంది.
రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనౌన్స్‌మెంట్ల ద్వారా గుర్తుచేసుంది. తూర్పుకోస్తా ఆర్పీఎఫ్ ఐజీపీ అలోక్ బొహ్రా, వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా ఈ రోబో సేవలను ప్రారంభించారు. ఈ హ్యూమనాయిడ్ రోబోకు రైల్వే పోలీసులు ఏఎస్‌సీ అర్జున్ అని నామకరణం చేశారు. కరోనా సమయంలో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే థర్మల్ పరికరాన్ని కనుగొన్న అర్జున్ పేరు పెట్టడం విశేషం.
ఏడాది పాటు శ్రమించి అనేక రకాలుగా మార్పులు, చేర్పులు చేసి దీన్ని తయారు చేశారు. ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యింది. భవిష్యత్తులో రోబోను మరింతగా ఆధునికీకరించనున్నారు. ప్రతి రైల్వేస్టేషన్‌లో ఏఎస్‌సీ అర్జున్ సేవలు ఉపయోగించుకునేలా రైల్వే పోలీసులు ప్రణాళిక చేస్తున్నారు. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే అత్యాధునిక ఏఐ, ఐవోటీ సాంకేతికత, రియల్ టైం పర్యవేక్షణ సామర్థ్యాలతో పని చేస్తుంది. దీంతో అనేక రకాల పనులు సులభంగా చేసుకోవచ్చు.
ఏఎస్‌సీ అర్జున్ అదేనండి రోబో జన్మస్థలం విశాఖే. రోబోకాప్లర్ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం గమనార్హం. ఈ రోబో పక్కా ‘మేడిన్ ఆంధ్ర’ అన్న మాట. ముఖ్యంగా ఆర్పీఎఫ్ పోలీసులకు, ప్రయాణికులకు స్మార్ట్‌గా సహాయపడనుంది. ముఖ గుర్తింపు పరిజ్ఞానంతో చొరబాటుదారులను గుర్తించి వెంటనే అప్రమత్తం చేస్తోంది. దీనికి నలువైపులా నిఘా కళ్లు ఉన్నాయి. వీటి ద్వారా చుట్టూ జరుగుతున్న వాటిని ఇట్టే కనిపెట్టేస్తుంది.
స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఏఐ ద్వారా అంచనా వేసి రద్దీని నియంత్రించడంలో సహకరిస్తుంది. భద్రతా సిబ్బంది అవసరం ఎక్కడైనా ఉంటే వెంటనే ఆయా ప్రాంతాలకు సమాచారం పంపిస్తుంది. రోబో హిందీ, తెలుగు, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు. ప్రజలకు అవసరమైన సమాచారం చేరవేస్తుంది. అదే విధంగా ప్రకటనలకు ఉపయోగపడుతుంది. స్టేషన్‌లో అగ్నిప్రమాదాలు, పొగ రావడం వంటివి గుర్తించి తక్షణం అందరినీ అప్రమత్తం చేస్తుంది. నిత్యం స్టేషన్‌లోనే ఉండి ఇక్కడికి వచ్చే వారి ఫొటోలు తీస్తుంది. వీరిలో అనుమానితులు, తరచూ రైల్వే స్టేషన్‌కు వచ్చే వారి చిత్రాలు గుర్తిస్తుంది. వారి సమాచారం అధికారులకు పంపిస్తుంది.

More Stories
కేరళలోనూ గుజరాత్ తరహాలో త్వరలో అధికార మార్పు
కేరళలో ఎన్డీయే వైపు మొగ్గు చూపుతున్న పట్టణ దళితులు
మనుగడలో లేని కంపెనీ నుండి ఐ-ప్యాక్ కు రూ. 13.50 కోట్ల రుణం