అనిల్ అంబానీ, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ) సంస్థలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఫ్రెష్ నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ భారీ బ్యాంకింగ్, కార్పొరేట్ మోసాలకు పాల్పడ్డారని, దీనిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిల్‌ను విచారించిన న్యాయస్థానం సీబీఐ, ఈడీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై 10 రోజుల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో భారీ బ్యాంకింగ్, కార్పొరేట్ కుంభకోణం జరిగిందంటూ మాజీ కేంద్ర కార్యదర్శి ఈఏఎస్. శర్మ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) వేశారు. దీనిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. అంతేకాదు గతేడాది నవంబర్ 18న జారీ చేసిన నోటీసులకు సంబంధించి అనిల్ అంబానీ, ఏడీఏజీ స్పందించకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.
వారికి చివరి అవకాశం కల్పిస్తూ, బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయన్యాది ప్రశాంత్ భూషణ్ “ఇది భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద మోసం” అని అభివర్ణించారు. 2007-08 నుంచే ఈ మోసం సాగుతున్నప్పటికీ, 2025లో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని ఆయన సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
కేవలం అంబానీ గ్రూప్ మాత్రమే కాకుండా, ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారులు కూడా కుమ్మక్కు అయ్యారని, కానీ దర్యాప్తు సంస్థలు ఆ కోణంలో విచారణ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అనిల్ అంబానీ ప్రజాధనాన్ని అక్రమ మార్గంలో దారి మళ్లించారని, ఆర్థిక నివేదికలను తారుమారు చేశారని, పలు సంస్థల ద్వారా వ్యవస్థాగతమైన మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు ఆయన బ్యాంక్ అధికారుల సహకారంతో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను 10 రోజుల తర్వాత చేపడతామని పేర్కొంది.

More Stories
మన దేశంలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారీ
ఈయూ జీఎస్పీ రద్దుతో భారత్ ఎగుమతులపై పిడుగు
పెట్టుబడిదారులకు భారత్ బ్రైట్ స్పాట్