ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడంతో ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచాయి. అయితే ఇవాళ మొత్తం మేఘాలు కమ్ముకుని ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 4.50 నిమిషాలకు భారతీయ వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. అతిశీతల గాలులు కూడా వీయనున్నాయి. వర్షం వల్ల ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. మరోవంక కశ్మీర్లో మంచు కురిసింది. గుల్మార్గ్తో పాటు కశ్మీర్ లోయలో అనేక ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకున్నది.
శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అతివేగంగా శీతల గాలులు వీస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లో కొత్తగా మంచు పడింది. మధ్యధరా ప్రాంతం నుండి వచ్చే బలమైన అల్పపీడనం వల్ల వాతావరణ మార్పు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భీకరంగా మంచు కురవడంతో శ్రీనగర్ విమానాశ్రయం మంచుతో నిండిపోయింది. ఫ్లయిట్ ఆపరేషన్స్ అన్నీ స్తంభించిపోయాయి. మంచు కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో 26 విమానాలను రద్దు చేశారు.
రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లే రోడ్డు స్నోతో నిండిపోయింది. హిమాచల్‌లోని మనాలీలో కూడా స్నో కురుస్తోంది. శీతాకాలం అంటే కశ్మీర్లో మంచు కురవాల్సిందే. కానీ గత మూడు నెలల నుంచి కశ్మీర్ లోయల్లో మంచు కురవకపోవడంతో అక్కడ టూరిజం ఇండస్ట్రీ దివాళా తీసింది. స్కీయింగ్‌కు గుల్మార్గ్ ఫేమస్. కానీ అక్కడ కొన్ని నెలల నుంచి మంచు ఆనవాళ్లే లేవు.
హిమాలయాల్లో చాలా వరకు పర్వతాలు ఈ శీతాకాలంలో మంచు లేకుండానే దర్శనం ఇచ్చాయి. మంచు కరువుతో నిండిన ఆ ప్రాంతంలో నిన్నటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్తో అకస్మాత్తుగా ఇప్పుడు కశ్మీర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో మంచు, వర్షం కురుస్తున్నది. దీంతో అనేక టూరిస్టు కేంద్రాలు ఇప్పుడు స్నోఫాల్‌తో ఆకట్టుకుంటున్నాయి. జమ్మూ జిల్లాలోని హిల్ రిసార్ట్ బటోట్ పట్టణంలో ఇవాళ భారీగా మంచు కురిసింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కూడా ఇవాళ మంచు భీకరంగా కురిసింది. ధర్మశాలలో స్వల్ప స్థాయిలో వర్షం కురిసింది. దీంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. కొండ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం బదెర్వా పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేశారు.

More Stories
కలుషిత తాగునీటితో ఇండోర్‌లో 24 మందికి అస్వస్థత
లష్కరే తోయిబాలో చేర్పిస్తున్న కీలక నిందితుడికి పదేళ్లు జైలు
ఆర్మీ వాహనం లోయలో పడి 10 మంది సైనికులు మృతి