‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ ఛార్టర్‌పై ట్రంప్ సంతకం

‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ ఛార్టర్‌పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం దావోస్‌లో ఇతర వ్యవస్థాపక సభ్యులతో కలిసి ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ ఛార్టర్‌పై సంతకం చేశారు. ఇజ్రాయిల్‌ దాడికి గాజా చిన్నాభిన్నమైంది. గాజాలో శాంతిని నెలకొల్పి.. దాని పునర్నిర్మాణం కోసం ఈ బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ను ట్రంప్‌ ఏర్పాటు చేశారు. ఇందులో చేరేందుకు ఆయా దేశాలు చెల్లిచిన డబ్బుతో.. గాజాను పున:నిర్మించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డులో పాల్గొనమని ట్రంప్ 60 దేశాలను ఆహ్వనింస్తే, ప్రారంభంలో 19 దేశాలు మాత్రమే పాల్గొనడం గమనార్హం.
 

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గాజా శాంతి మండలి ప్రారంభోత్సవానికి భారత్, చైనా సహా పలు ఐరోపా దేశాలు గైర్హాజరు అయ్యాయి.  గ్రీన్‌లాండ్‌ విషయంలో ఐరోపా దేశాల వైఖరిని అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనలేదు.  బోర్డ్ ఆఫ్ పీస్ ప్ర‌తిపాద‌న‌కు యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, ఖ‌తార్, బ‌హరెయిన్‌, పాకిస్థాన్‌, ట‌ర్కీ, హంగేరీ, మొరాక్కో, కొసావో, అర్జెంటీనా, ప‌రాగ్వే దేశాలు ఆమోదం తెలిపాయి.

క‌జ‌కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా, వియ‌త్నం దేశాలు కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఆ బోర్డులో ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్యూ ఉన్నారు. అర్మేనియా, అజ‌ర్‌బైజాన్ కూడా అమెరికా ప్ర‌తిపాదిత శాంతి ఒప్పందాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయి. బెలార‌స్ నేత అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్ప‌టికే సంత‌కం చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు పుతిన్ అప్పుడే బిలియ‌న్ డాల‌ర్ల ఫీజు చెల్లించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలిసింది. 

కొన్ని ష‌ర‌తుల ప్ర‌కారం ఆ బృందంలో జ‌త‌క‌లిసేందుకు కెన‌డా ప్ర‌ధాని మార్క్ కార్నే అంగీక‌రించారు. బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు ఫ్రాన్స్‌, నార్వే దేశాలు వ్య‌తిరేకించిన‌ట్లు తెలుస్తోంది. చైనాకు ఆహ్వానం వెళ్లింది. కానీ ఆ దేశం ఇంకా ఏమీ వెల్ల‌డించ‌లేదు. రష్యా మాకు శ‌త్రువు కాబట్టి, ఆ బోర్డులో ఉండేది డౌటే అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. బోర్డు మీటింగ్‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని ఇట‌లీ ప్ర‌ధాని మెలోనీ తెలిపారు.

ఆ బోర్డుకు నిర‌వ‌ధిక చైర్మెన్‌గా ట్రంప్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ బోర్డు క్రియేట్ చేసుకున్న తీర్మానం ప్ర‌కారం ఆయ‌న చాన్నాళ్లు ఆ ప‌ద‌విలో కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్‌లో అల్లుడు జేర్డ్ కుష్న‌ర్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్‌, బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ ఉండ‌నున్నారు.