నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ రద్దు వివాదంపై రంగంలోకి కేంద్ర బృందం

నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ రద్దు వివాదంపై రంగంలోకి కేంద్ర బృందం

నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని  ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కూడిన ఈ బృందం త్వరలో రాష్ట్రానికి రానుంది. బొగ్గుశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు త్వరలో రాష్ట్రానికి వచ్చి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై విచారణ జరపనున్నారు. అసలు టెండర్‌ రద్దు అవ్వడానికి గల కారణాలను తెలుసుకోనున్నారు.

ఒడిశాలోని నైనీ ప్రాంతంలో సింగరేణికి బొగ్గు గనులు ఉన్నాయి. ఇక్కడ బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ ఎంపికకు టెండర్లు ఆహ్వానించింది. అయితే టెండర్ల స్వీకరణలో లోపాలెందుకు తలెత్తాయని బుధవారమే సింగరేణి సంస్థను కేంద్ర బొగ్గుగనుల శాఖ ప్రశ్నించింది. డిల్లీలోని శాస్త్రి భవన్లోని బొగ్గుగనుల కార్యాలయంలో ఆ శాఖ సంయుక్త కార్యదర్శి కె.సంజీవ్‌కుమార్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నైనీ బొగ్గు గని టెండర్లపై సమీక్ష జరిపారు.

 సింగరేణి పాలకమండలి(బోర్డు)లో కృష్ణభాస్కర్‌ ఛైర్మన్‌ కాగా, కేంద్ర బొగ్గుశాఖ జాయింట్ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సింగరేణి డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. నైనీ గని ఎంఓడీ టెండర్ల ప్రక్రియలో సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ముందే లోతుగా ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. 

ఒకవేళ చర్చించి ఉంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. దీంతో పాటు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాన్ని టెండర్‌ వేయదలచిన కంపెనీలకు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే టెండర్ల దాఖలుకు గురువారం నుంచి ఈ నెల 29 వరకూ సమయం ఇచ్చామని సింగరేణి అధికారులు వివరించినట్టు తెలుస్తోంది.  టెండర్ల స్వీకరణ ప్రారంభమే కానందున, వాటిని తిరస్కరించే ప్రశ్న ఉత్పన్నం కాదని వారు చెప్పినట్లు సమాచారం.

అయితే ఆరోపణలు రాగానే టెండర్‌ నోటిఫకేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారని వారు తెలిపారు.  దీనిపై పాలకమండలి భేటీలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

నైనీ ఎంఓడీపై 2016లో కూడా సంస్థ నైనీ ఎంఓడీపై టెండర్ ప్రకటన జారీ చేసింది. అయితే ఇందులో నిబంధనలు పాటించడం లేదని అప్పుడు ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. దాంతో టెండర్ల ప్రకటనను రద్దు చేశారు. తిరిగి గత నవంబరులో ప్రకటన జారీ చేసి ఈ నెల 29 వరకూ టెండర్ల స్వీకరణకు గడువు నిర్ణయించారు. అయితే మళ్లీ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.