మావోయిస్టులకు మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో సారండా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోలు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ మరణించారు.
కాగా, పతిరామ్ మాంఝీపై రూ.5 కోట్లు రివార్డు ఉంది. ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాతే వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. చైబాసాలోని కిరీబురు పోలీస్‌స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సారండా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, భద్రతా దళాలు కలిసి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టాయి.
ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోలు కాల్పులు జరిపారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు మావోలపై భీకర కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనల్లో నక్సలైట్లకు భారీగానే నష్టం కలిగిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టు కమాండర్ హతమైనట్లు తెలిసింది. అతనిపై రూ.50 లక్షల రూపాయల రివార్డు ఉందని సమాచారం.
గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోల మధ్య కాల్పులు జరిగినట్లు కొల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మరిన్ని వివరాలను ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. దట్టమైన అడవుల్లో నక్స్‌లైట్లు దాక్కుని ఉన్నారని తెలిపారు. వారిని అంతమొందించడానికి అదనపు బలగాలను కూడా మోహరించినట్లు చెప్పారు.
ఝార్ఖండ్‌ను నక్స్‌లైట్ రహిత రాష్ట్రంగా మార్చడానికి అతిపెద్ద అడ్డంకి ఈ సారండా అటవీ ప్రాంతమే. దీనిని ఝార్ఖండ్ నక్సల్ కమాండ్, ప్రస్తుత నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెసరా నాయకత్వం వహిస్తున్నాడు. అతడిపై కూడా రూ.కోటి రివార్డు ఉంది. మిసిర్ బెసరాతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు అనల్ దా, అసీమ్ మండల్, ఝార్ఖండ్ బిహార్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు సుశాంత్ సహా 60 మంది నక్సలైట్లు ఉన్నారు.
వారందరూ కొల్హాన్‌లో క్యాంపింగ్ చేస్తున్నారు. అదనంగా, 20 నుంచి 25 మంది నక్సలైట్ల బృందం నక్సలైట్ కమాండర్ అజయ్ మహతో కోసం పనిచేస్తుంది. వీళ్లు పశ్చిమ సింహ్భూమ్లో కూడా క్యాంపింగ్ చేస్తోంది. జనవరి 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య బస్తర్ డివిజన్లోని వివిధ జిల్లాల జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు 256 మంది మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 665 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Stories
ఆర్మీ వాహనం లోయలో పడి 10 మంది సైనికులు మృతి
గణతంత్ర వేడుకలే లక్ష్యం గా పాక్ ఉగ్రవాదులు
చైనా, మయన్మార్, ఇజ్రాయెల్ ల్లో అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు