నకిలీ పిజా హ‌ట్‌ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి

నకిలీ పిజా హ‌ట్‌ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి
పాకిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ న‌వ్వుల పాల‌య్యారు. సియాల్‌కోట్ కంటోన్మెంట్ ఏరియాలో న‌కిలీ పిజా హ‌ట్‌ ను ఆయ‌న ప్రారంభించారు. అమెరికాకు చెందిన పిజా హ‌ట్ ఫుడ్ కంపెనీ త‌న స్టోర్‌ను పాకిస్థాన్‌లో ఓపెన్ చేస్తున్న‌ట్లు హంగామా చేశారు. చాలా భారీ ఎత్తున ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ప్రారంభోత్సవం  త‌ర్వాత ఆ ఈవెంట్‌కు చెందిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యింది.
ర‌క్ష‌ణ మంత్రి పిజా హ‌ట్ ఔట్‌లెట్‌ను ప్రారంభించడం ఏంట‌ని ఆ కంపెనీ ఖంగుతిన్న‌ది. దీంతో ఆ అంశంపై స్పష్టత ఇచ్చింది. రెడ్‌రూఫ్ లోగోతో పిజా హ‌ట్‌ను ఓపెన్ చేయ‌డం అనుమానాలు రేకెత్తించింది. లోగో, బ్రాండ్ అస‌లు కంపెనీ త‌ర‌హాలో ఉండ‌డంతో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది.  కానీ పిజా హ‌ట్ వెబ్‌సైట్‌లో సియాల్‌కోట్ లొకేష‌న్ లేక‌పోవ‌డం యూజ‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టింది. దీంతో పిజాహ‌ట్ కంపెనీ అధికారికంగా స్పందించింది.
త‌మ పేరు, లోగోతో సియాల్ కోట్ కంటోన్మెంట్‌లో ఔట్‌లెట్‌ను ప్రారంభించారని చెబుతూ పిజా హ‌ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది.  “సియాల్‌కోట్ కంటోన్మెంట్‌లో హట్ పేరు, బ్రాండింగ్ ఇటీవల ప్రారంభించారు. ఈ అవుట్‌లెట్ పిజ్జా హట్ పాకిస్తాన్ లేదా యమ్! బ్రాండ్‌లతో సంబంధం కలిగి లేదు. ఇది పిజ్జా హట్ ఇంటర్నేషనల్ వంటకాలు, నాణ్యత ప్రోటోకాల్‌లు, ఆహార భద్రత లేదా కార్యాచరణ ప్రమాణాలను పాటించదు” అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
 
నిజం తెలిసిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో పాక్ మంత్రికి వ్య‌తిరేకంగా మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఎక్స్, రెడ్దిట్  వంటి ప్లాట్‌ఫారమ్‌లలోని నెటిజన్లు ఈ పరిస్థితిని “పిజ్జా-గేట్” అని ఎద్దేవా చేశారు. ఒకరైతే “దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ ఈ స్థితిలో ఉన్నప్పుడు, సహజంగానే తదుపరి ప్రాధాన్యత నకిలీ పిజ్జాలను పొందడం” అని వ్యాఖ్యానించారు. ఇతరులు “నకిలీ” అవుట్‌లెట్, ప్రస్తుత పరిపాలన చేసిన రాజకీయ వాగ్దానాల మధ్య సమాంతరాలను చూపించారు.