మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే సింగరేణిలో టెండర్ వివాదాలు బయటకొచ్చాయని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నిరకాలుగా సింగరేణిలో విధ్వంసం చేయవచ్చో పదేళ్ళపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ అవినీతి అక్రమాలకు సింగరేణిని బంగారు బాతుగా వాడుకున్నాయని, సింగరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకున్నాయని ఆయన మండిపడ్డారు.
లాభాల్లో ఉన్న సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యల్లో చిక్కుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% ఉన్నా అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదే అక్కడ ఆధిపత్యం కొనసాగుతుందని, కేంద్రానికి ఏ రకంగా జోక్యం చేసుకొనే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు.
ముగ్గురు కేంద్రం నుంచి, 7 గురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని చెబుతూ బిఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పదేళ్లపాటు ‘కల్వకుంట్ల ఫ్యామిలీ’ మాటే సింగరేణిలో చెల్లుబాటైందని, టెండర్ల దగ్గర్నుంచి చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబం ఆడింది ఆట అన్నట్లు సాగిందని ఆయన తెలిపారు.
ఒకప్పుడు బిఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్)లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. వాజ్‌పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారని, తద్వారా సింగరేణి లాభాల బాటలో పడిందని చెప్పారు. కానీ 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చిందని, అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్ ను కేటాయించిందని, 2015లోనే ఈ బ్లాక్ కేటాయించి, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించిందని ఆయన వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో.. టెండర్లను ఆహ్వానించి, ముఖ్యపద్ధతిలో టెండర్లను ఆహ్వానించి వెనక్కు తగ్గారని కేంద్ర మంత్రి తెలిపారు.
2024లో మంత్రి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారని, ఇవాళ కాంగ్రెస్ కూడా అదే తాను బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఒడిశా లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైని కోల్ బ్లాక్ కు సంబంధించిన చివరి అనుమతులు వచ్చేలా చొరవతీసుకున్నానని చెప్పారు. ఈ ప్రయత్నాల కారణంగా 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఆమోదముద్రవేస్తూ 4 జూలై, 2024 నాడు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
నైని బ్లాక్ కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించాల్సింది పోయి పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సంబంధించి టెండర్లో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం,రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చిందని ఆయన తెలిపారు. అనేక చోట్ల సైట్ విజిట్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అది సెల్ఫ్ డిక్లరేషన్ అని పేర్కొన్నారు.
బ్లాక్ కు సంబంధించి సరైన వివరాలు తెలియకుండా టెండర్ కు వస్తే ఇబ్బందులుంటాయని, అవగాహన కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చామని వివరించారు. అయితే, సింగరేణి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోచాలా చోట్ల టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తూ పారదర్శంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
కానీ సింగరేణిలో ‘సైట్ విజిట్’ నిబంధనను తప్పనిసరి చేసి బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కోల్ బ్లాక్ కు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలని బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారవేసారు. సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని చెబుతూ కానీ కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్కోకు కేటాయించగా, దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకు వస్తే, వారితో ‘మేం పనిచేయలేమని లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఇవాళ సుమారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సుమారు రూ.47వేల కోట్ల బకాయి పడిందని ఆయన చెప్పారు.

More Stories
పెట్టుబడిదారులకు భారత్ బ్రైట్ స్పాట్
తమపై భారీగా పన్నులు వేయమని సంపన్నుల విజ్ఞప్తి
ఉదయనిధిది విద్వేష ప్రసంగమే.. జాతి విధ్వంసం ప్రేరేపిస్తుంది