రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం 

రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం 

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమవుతోంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. 10 ఏళ్లపాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ గడువు 2024 జూన్‌ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.  2024 జూన్‌ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తపరిచాయి. పట్టణాభివృద్ది, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది.  ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేబినెట్‌ నోట్‌ తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికారులు వెల్లడించారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు.  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అక్కడ అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్దఎత్తున రహదారులు, భవనాల నిర్మాణం మొదలైంది.  2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. నాటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. 

2024లో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ వెలుగులొచ్చాయి.  రాజధాని నిర్మాణం కోసం రూ.58 వేల కోట్లతో పనులు ప్రారంభించారు. అమరావతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు.

ఇప్పటికే రాజధాని అమరావతి పనులు అత్యంత వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ తమ సంస్థల నిర్వహణకు ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్ సహా ఎన్నో కంపెనీలు రానున్నాయి.  ఇదిలా ఉండగా మరోవైపు రాజధాని అమరావతి నగర విస్తరణలో భాగంగా రెండో విడత భూ సమీకరణకు యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూమి సమీకరిస్తున్నారు.